విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల 54 వేల మందికి ఇళ్ల స్థలాలు, 25 వేల 80 మందికి గృహ సముదాయాలను అందజేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. గ్రామీణ జిల్లాకు సంబంధించి 68వేల 939 మందికి సుమారు 14 వేల ఎకరాల్లో 957 లేఅవుట్లను.... నర్సీపట్నం, ఎలమంచిలి వంటి పురపాలక సంఘాల్లో ఆరువేల 883 మందికి 40 ఎకరాల్లో 24 లేవుట్ లను సిద్ధం చేశారు.
వాస్తవానికి వీటిని ఆగస్టు 15న అందజేయాల్సి ఉండగా... తాజాగా అక్టోబర్ 2కి ఈ ప్రక్రియను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తి కాగానే ఆయా కాలనీల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే.... జగనన్న కాలనీల్లో విద్యుత్ సదుపాయం కల్పించడానికి రూ.543.77 కోట్లు నిధులు అవసరమని ట్రాన్స్‌కో అధికారులు అంచనా వేశారు. ఈ నిధులతో ఆయా ప్లాట్లలో అవసరమైన చోట్ల స్తంభాలను ఏర్పాటు చేసి.... సబ్స్టేషన్లు, వీధి దీపాలు వంటివి ఏర్పాటు చేయనున్నారు.
అలాగే కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టడానికి నీటి సదుపాయం అవసరం ఉంది. దీని కోసం ప్రాథమికంగా 35 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు ఆయా కాలనీల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వం సూచించడంతో... రూ. 153.58 కోట్లతో రెండోసారి ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రతి ఇంటికి కనీసం యాభై లీటర్ల నీటి చొప్పున సగటున అంచనా వేసి ఈ ప్రతిపాదన రూపొందించినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందుకోసం జిల్లా మొత్తం మీద 68 చోట్ల ఓవర్హెడ్ ట్యాంకుల నిర్మాణం చేయాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి: ఫోన్ ట్యాపింగ్‌పై నిగ్గు తేల్చండి.. హైకోర్టులో పిల్.. నేడు విచారణ