విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆక్రమణలకు గురైన భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడం.., విలువైనవి కావడంతో కొండ ప్రాంతాలు, చెరువులనూ.. అక్రమార్కులు చెరబట్టారు. కొన్ని భూములపై ఇప్పటికీ దిగువస్థాయి కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కేసులు నడుస్తున్నాయి. భూకబ్జాలను నిగ్గుతేల్చేందుకు 2017లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు తేల్చింది. ఐతే ఆక్రమణకు గురైన భూముల స్వాధీనం ప్రక్రియ మొదలుకాలేదు. గతేడాది వైకాపా ప్రభుత్వం మరో సిట్ వేసింది. 4నెలలు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక అందజేసింది.
విశాఖ సమీపంలోని 13 మండలాల్లోని మూడింటిలో మాత్రమే ప్రభుత్వ భూముల కబ్జా జరగలేదని తేల్చారు. మిగిలిన 10 మండలాల పరిధిలో 4,900 ఎకరాల భూమి ఆక్రమణదారుల గుప్పిట్లో ఉందని గుర్తించారు. 11 వందల 68 ఎకరాలపై కోర్టు కేసులు నడుస్తుండగా మిగతాభూమి స్వాధీనానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే.. కొందరికి నోటీసులిచ్చారు. అక్రమార్కులెవర్నీవదిలేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కోరుతోంది. విశాఖ చుట్టుపక్కల భూ ఆక్రమణలపై ఏ సమాచారం అందినా పరిశీలిస్తున్నామన్న అధికారులు సర్కారీ భూముల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
ఇదీచదవండి