CM REVIEW On GLOBAL INVESTORS SUMMIT: వచ్చే నెల (మార్చి) 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఆ సదస్సు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమావేశమైయ్యారు. సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌ఎస్ రావత్, సమాచారశాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. సదస్సు కార్యక్రమాల షెడ్యూల్‌ను సీఎంకు అధికారులు వివరించారు.
వేదిక వద్ద జరుగుతున్న పనులు తదితర అంశాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. సదస్సుకు హాజరుకాబోతున్న కేంద్ర మంత్రుల, వ్యాపార వేత్తల వివరాలను సీఎంకు తెలియజేశారు. సదస్సు నిర్వహణకు సంబంధించి సీఎం జగన్ పలు సూచనలు చేశారు. మార్చి 3న ఉదయం అల్పాహారంతో తొలిరోజు కార్యక్రమం 10 గంటల ప్రాంతంలో ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. కీలక అంశాలపై సదస్సునుద్దేశించి పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపారవేత్తలు మాట్లాడుతారని.. ఆ తర్వాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. దీని తర్వాత వివిధ పారిశ్రామిక రంగాలపై సెషన్లు ఉంటాయన్నారు.
వ్యాపారవేత్తలతో సీఎం ముఖాముఖి చర్చలు జరపనున్నట్లు వివరించారు. సదస్సు ప్రాంగణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు సహా తొలిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలిరోజు రాత్రి సభకు హాజరైన వారికి విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. మార్చి 4న రెండోరోజున వాలెడిక్టరీ సెషన్ ఉంటుందన్నారు. ఈ సెషన్లో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారని.. రెండోరోజున పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు తెలిపారు.
అనంతరం ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ తరపున క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న బిషప్‌లు, రెవరెండ్‌లు ఇతర క్రైస్తవ సంఘాల ప్రతినిధులు.. తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో క్రిస్టియన్ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామని ఆయన ప్రకటించారు. తద్వారా వారి సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు.
చర్చిల ఆస్తుల గురించి, అవి అన్యాక్రాంతం అవుతున్న విషయం గురించి చర్చించారు. ఛారిటీ సంస్ధలు నడుపుతున్నవారికి.. స్ధానిక పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్‌ని వేడుకున్నారు. క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విన్నవించిన పలు అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించి.. చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు సీఎం హామీ ఇచ్చారు. జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారంతో పాటు.. ఎస్పీ, కలెక్టర్‌లు జిల్లా స్ధాయిలో సమస్యలను పరిష్కరిస్తారన్నారు. క్రిస్టియన్లకు శ్మశానవాటికలు ఏర్పాటుపైనా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
ఇవీ చదవండి