బాలికను ఇంట్లో నిర్భంధించి అత్యాచారం చేసిన కారు డ్రైవర్‌పై విశాఖ కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కేసుకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ బాలిక(17) గత మార్చి నెలలో కంప్యూటర్ కోర్సు నేర్చుకోవడం కోసం విశాఖలోని అక్క వద్దకు వచ్చింది. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అక్క ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేది. వారి పక్క ఇంట్లో నివసించే కారు డ్రైవర్ హేమంత్(24) ఈ విషయం గమనించాడు. ఏప్రిల్ నెలలో ఒక రోజు గ్యాస్ అయిపోవడంతో ఆ బాలిక అన్నం వండుకునేందుకు హేమంత్ ఇంటికి వెళ్లింది. అదును చూసుకుని అతడు బాలికను తన ఇంట్లో నిర్భందించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బాలిక భయపడి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. కొద్ది రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత తిరిగి శ్రీకాకుళం వెళ్లిపోయింది.
ఇటీవల బాలిక అనారోగ్యానికి గురైతే కుటుంబ సభ్యులు వైద్యుడికి చూపించారు. పరీక్షించి గర్భవతి అని చెప్పడంతో బాలికను తల్లిదండ్రులు నిలదీయగా హేమంత్ విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు బాలికతోసహా నగరానికి వచ్చి కంచరపాలెం పోలీసు స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును దిశ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టం, అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైకాపా నాయకుడు