విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని క్షేత్రస్థాయి నుంచి దిల్లీ వరకూ తీసుకువెళ్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో సమావేశమై సమాలోచనలు చేశారు. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో కూడుకున్నదని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి భూములు తీసుకున్నారని తెలిపారు. కర్మాగార పరిరక్షణకు అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, ఇందుకోసం ఓ కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామని తెలిపారు. ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరమని తెలిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ అవసరమైతే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పారని, అసెంబ్లీ సమావేశాల అనంతరం బృందంగా వచ్చి పూర్తి మద్దతు తెలుపుతానని హామీ ఇచ్చారని గంటా అన్నారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై సమావేశంలో చర్చించామని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు . ఎంతో అనుభవం ఉన్న ఉండవల్లి ఎన్నో విషయాలు తెలిపారని, ఆయన సలహాలు తీసుకున్నామని లక్ష్మీనారాయణ అన్నారు. ప్లాంట్‌ను కాపాడుకునే అవకాశం ఉన్నా కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. దేశంలోని ఇతర కర్మాగారాలతో దీన్ని చూడరాదన్నారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే వ్యూహరచన చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు యువత !