విశాఖలో వానప్రస్థం వృద్ధాశ్రమ సంస్థ.. కొవిడ్ సమయంలో విశిష్టమైన సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. కరోనా బాధితులకు ఉచితంగా రవాణా సదుపాయాన్ని కల్పిస్తూ వాహనాలను సిద్ధం చేసింది. కరోనా రోగులు తమ వైద్య అవసరాల కోసం వీటిని వినియోగించుకోవచ్చని తెలిపింది. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలన్నా, చికిత్స పూర్తయిన అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరాలన్నా, మెడికల్ టెస్టుల కోసం డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లాలన్నా... వానప్రస్థం వృద్ధాశ్రమ సేవలను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
విశాఖ నగర పరిధిలో మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. తగరపువలస, లంకెలపాలెం, పెందుర్తి ప్రాంతాల నుంచి నగరంలోని ఏ ఆసుపత్రికైనా కరోనా రోగులను తరలిస్తారు. కోవిడ్ రోగులకోసం అత్యవసరంగా ప్రారంభించిన ఈ సేవలను.. వానప్రస్థం వృద్ధాశ్రమ సంస్థ నర్సింగ్ సిబ్బంది శ్యామల, జయశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ఏజ్ కేర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎన్ఎస్. రాజు.. ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే కరోనా రోగులకు ఈ సేవలు అందించగలమని సంస్థ నిర్వాహకులు రొబ్బి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రోగులపై వివక్షను పక్కనపెట్టి ప్రతిఒక్కరూ సేవా దృక్పథాన్ని చాటాలన్న ధ్యేయంతోనే.. ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: