విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాద స్థలంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆసుపత్రులకు, బంధువులకు చేరవేయటంతో పోలీసులు కీలక పాత్ర పోషించారు. పీపీఈ కిట్లు ధరించి సెల్‌ఫోన్‌ను బయటకు తీసిన పోలీసు, మార్చురీ సిబ్బంది బంధువులకు సమాచారమిచ్చారు. రెవెన్యూ, ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం కారణంగా ఆదివారం ఉదయం 8.30 గంటలకే మృతదేహాలు మార్చురీకి చేరుకున్నా వాటిని గుర్తించే పని కాస్త ఆలస్యమైంది. ఆసుపత్రి వర్గాలు, రెవెన్యూ విభాగం అధికారులకు పోలీసులు పలుమార్లు ఫోన్లు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఎట్టకేలకు పశ్చిమ మండలం ఏసీపీ కె.సుధాకర్ ఆధ్వర్యంలోని సీఐలు మోహన్‌రెడ్డి, ఉమర్, బాలమురళీకృష్ణ, ఇబ్రహీంపట్నం సీఐ, తదితరులు పీపీఈ కిట్లు ధరించి మృతదేహాలను కాస్త వరుస క్రమంలో సర్దారు.
మార్చురీ సిబ్బందికి ధైర్యం చెప్ఫి మోగుతున్న సెల్‌ఫోన్లను మృతదేహాల నుంచి వెలికితీసి వారి బంధువులకు సమాచారం చేరవేశారు. 10 మృతదేహాల వద్ద 10 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ఐదుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు.. మృతుల బంధువుల వద్దకు వెళ్లి వారి వివరాలను నమోదు చేయించారు. నూతనంగా నిర్మిస్తున్న మల్టీస్పెషాలిటీ బ్లాక్‌లో తాత్కాలికంగా పోలీసు అవుట్‌పోస్టును ఏర్పాటు చేసి వారి బంధువులకు సమాచారం అందించారు.
మధ్యాహ్నం 2గంటలవుతున్నా ఆసుపత్రి వర్గాలు, రెవెన్యూ విభాగాల నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో ఏసీపీ కె.సుధాకర్ సీపీకి విషయం తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నాంచారయ్య వద్దకు ఏసీపీ కె.సుధాకర్ వెళ్లి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడించారు. దీంతో మృతదేహాలకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించి, గంటలో ఫలితాన్ని రాబట్టారు. అందులో ఎనిమిది మందికి నెగెటివ్, ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. నెగెటివ్ వచ్చిన ఎనిమిది మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి అంబులెన్సుల్లో పోలీసులే దగ్గరుండి వారి బంధువులకు అప్పగించారు. పాజిటివ్ వచ్చిన రెండు మృతదేహాలను ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలోనే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పూడ్చి పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. మార్చురీ వద్ద కొందరు సొమ్మసిల్లి పోవడంతో వారికి పోలీసులు మంచినీరు ఇచ్చి ఓదార్చారు. మార్చురీ సిబ్బందికి, మృతుల బంధువులకు మాస్కులను, గ్లౌజులను సైతం పంపిణీ చేశారు.
ఇవీ చదవండి