విశాఖ నగరాన్ని పారిశుద్ధ్యం, అభివృద్ధిలో ముందంజలో నిలిపే దిశగా జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళిక రూపొందించింది. స్వచ్ఛతా ర్యాంకులు మొదలు నగర ప్రతిష్టను పెంచే అన్ని అంశాలకు జీవీఎంసీ ప్రాధాన్యతనిస్తోంది. పర్యావరణ హిత బాటలో నగరాన్ని తీర్చిదిద్దడం ద్వారా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచే యోచన చేస్తున్నట్లు చెబుతున్న... జీవీఎంసీ కమిషనర్ సృజనతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ప్ర. భూగర్భ విద్యుత్, 24గంటల మంచినీటి సరఫరా పనులతో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంకా ఎంత కాలం ఈ పనులు కొనసాగుతాయి. ప్రజలకు ఇబ్బందులు తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ?
జ. మౌలిక సదుపాయాల కల్పన కోసం హుద్ హుద్ ప్రభావం తర్వాత అనేక ప్రాజెక్టులు వచ్చాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో కూడా రూ.వెయ్యి కోట్ల వరకు మౌలిక వసతుల కోసం కేటాయింపులు ఉన్నాయి. ఈ పనులతో ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతోంది. కానీ, ఈ పనులు నగర అభివృద్ధి, భవిష్యత్ అవసరాలు, సౌకర్యాల కోసం. ఈపీడీసీఎల్తో సమన్వయం చేసుకుంటూపని చేసే ప్రదేశంలో ప్రత్యేక ప్రమాణాలు పాటిస్తున్నాం. గుత్తేదారులు తాము తవ్విన ప్రదేశం వరకు మాత్రమే పునరుద్ధరణ పనులు చేస్తారు. పూర్తి స్థాయిలో రీ లేయింగ్ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పనులు చివరకు చేరుకుంటాయి. ఏప్రిల్ నాటికి నగరంలో రహదారులను తవ్వి చేసే పనులు అన్నింటినీ పూర్తి చేసి సాధారణ స్థితి ఏర్పరుస్తాం.
ప్ర. హైదరాబాద్లో వరద ప్రభావం చూస్తున్నాం. గతంలో అనేక నగరాలు ఈ తరహా సమస్యలను చవి చూశాయి. విశాఖలో గెడ్డలు, నాళాల నిర్వహణ ఎలా ఉంది. వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు?
జ. జీవీఎంసీ 650చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది. శివారు ప్రాంతాల్లో జనావాసాలు తక్కువగా ఉంటాయి. ఆ ప్రదేశాల్లో గెడ్డలు వంటివి ఆక్రమణలకు గురవడానికి అవకాశం ఉంది. జీవీఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు, గెడ్డలు వంటివి అన్నీ మ్యాపింగ్ చేసి జీఐఎస్ ప్లాట్ ఫాంపై పెడుతున్నాం. ఈ ప్రయత్నం నగరంలోని ఉన్న నీటి వనరుల సంబంధిత సమాచారంపై అధ్యయనంగా ఉపయోగపడుతుంది. నగరంలో చిన్న, పెద్ద 120వరకు చెరువులు ఉన్నాయి. వాటికీ జియో ఫెన్సింగ్ చేయనున్నాం.ఇలా అవసరమైన సంరక్షణ, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నాం. గెడ్డలు వంటి వాటిపై ఆక్రమణలు లేకుండా చూసేందుకు ఈప్రయత్నాలు ఉపకరిస్తాయి.
ప్ర. కొవిడ్ మహమ్మారితో మాస్క్ లు, శానిటైజర్ల వినియోగం పెరిగింది. చాలా మంది హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాదకర వ్యర్థాల శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఈ విషయాలపై ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలకు ఏం సూచిస్తారు?
జ. కొవిడ్ సమస్య ఇంకా తీరిపోలేదని ప్రజలు గుర్తించాలి. ఇంకా ఎలాంటి వ్యాక్సిన్ రాలేదు. ప్రమాదకర వ్యర్థాల సేకరణకు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రధాన అంశంగా తీసుకున్నాం. ఆ సమయంలో బ్యాటరీలు వంటివి ఆ జాబితాలో ఉండేవి. ప్రస్తుతం వాటి స్థానంలో మాస్క్ లు వంటివి చేరాయి. ఇప్పుడు ఇలాంటి వ్యర్థాలను ముఖ్యంగా చూడాల్సి వస్తోంది. ప్రత్యేకంగా డిస్పోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
ప్ర. విశాఖకు స్వచ్ఛతా ర్యాంకులు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఈ ఏడాది మంచి ర్యాంకు వచ్చినా గత రెండేళ్లలో కొద్దిగా తడబాటు చూశాం. మంచి ర్యాంకును కాపాడుకుంటు ప్రజల్లో స్వచ్ఛ స్ఫూర్తిని కొనసాగించే దిశగా ఎలాంటి కార్యచరణతో ముందుకు వెళుతున్నారు.
జ. స్వచ్ఛ సర్వేక్షన్ ప్రారంభం నుంచి ఇప్పటికి ప్రతి ఏటా ప్రమాణాలను పెంచుకుంటు వస్తోంది. ప్రస్తుతం చెత్త నిర్వహణ, చెత్తసేకరణ, ప్రజల భాగస్వామ్యం ఇలా భిన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కార్పొరేషన్ వరకు మాత్రమే స్వచ్ఛతా స్ఫూర్తి ఉందా? లేక ప్రజా చైతన్యంగా మారిందా? అనే విషయాలను గమనిస్తున్నారు. 2019 సర్వేక్షన్ లో తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడంలో బలహీనంగా ఉన్నట్లు గుర్తించాం. ఈ ఏడాదికి ఆ సమస్యను అధిగమించాం. ఈ ఏడాది ర్యాంకింగ్ 9కిఎందుకు పరిమితం అయ్యామని ఆలోచించాం. ప్రజల భాగస్వామ్యం అనేది ఇప్పుడు జీవీఎంసీ ముందున్న సవాలు. స్వచ్ఛతా యాప్ వినియోగం, అవగాహన వంటి వాటిపైనా దృష్టి పెడతాం. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. స్వచ్ఛ ర్యాంకుల్లో మరింత ముందంజలో ఉండేందుకు ఇవన్నీ దోహదం చేస్తాయి.
ప్ర.రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ బీచ్ గుర్తింపు వచ్చింది. అక్కడి ప్రాధాన్యత అంశాల్లో జీవీఎంసీ భాగస్వామ్యం ఎలా ఉంది. సముద్ర నీటి నాణ్యతను ఎలా కాపాడుతున్నాు. పరిశుభ్రతకు సంబంధించిన అంశాల పర్యవేక్షణ గురించి ఏం చెబుతారు.?
జ. గెడ్డల నుంచి ప్రవహించే నీటిని శుద్ధి చేయడం, ఘన వ్యర్థాలు సముద్రంలోకి వెళ్లకుండా చూడడం ముఖ్యం. గెడ్డల నుంచి సముద్రంలో నీరు కలిసే చోట ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశాం. రుషికొండ బీచ్ లోకి జంతువులు రాకుండా చూడడం, చెత్తనిర్వహణ, పరిశుభ్ర వాతావరణం ఉంచడం, తాగు నీరు సరఫరా చేయడం వంటివి పర్యాటక శాఖతో సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాం.
ఇదీ చదవండి: