ఉత్తరాంధ్రలో లాటరైట్ మాటున జరుగుతున్న బాక్సైట్ అక్రమ మైనింగ్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు మాజీమంత్రి కిడారి శ్రావణ్ తెలిపారు. ఈ మేరకు నేతలు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, గిడ్డి ఈశ్వరిలతో కలిసి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. విశాఖ జిల్లాలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగిస్తూ..గిరిజన సంపదను కొల్లగొడుతున్నారని శ్రవణ్ ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా గిరిజనుల పట్ల కపట ప్రేమ కనబరిచిన జగన్..అధికారంలోకి రాగానే వారి జీవనశైలి దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మన్యంలో రహదారి నిర్మిస్తామని భూములు తీసుకొని మైనింగ్ మాఫియాకు తెరలేపారని, అనుమతులు లేకుండా వేలాది వృక్షాలు నరికివేయటంతో పాటు ఉపాధి హామీ పనుల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కూలీలతో సంబంధం లేకుండా రహదారిని యంత్రాలతో ఏర్పాటు చేసి ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచారని శ్రవణ్ విమర్శించారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకొని..గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సమత తీర్పును గౌరవించాలన్నారు. లేదంటే గిరిజనులందరూ ఏకమై గిరిజన ద్రోహుల అంతు చూస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి
TDP fact finding comity on Mining: మైనింగ్‌పై తెదేపా నిజనిర్ధారణ బృందం యాత్ర.. తీవ్ర ఉద్రిక్తత!