లాక్ డౌన్ నేపథ్యంలో అనేక చోట్ల ప్రజలు తిండి దొరక్క అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వారికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువకులు యువకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తమ అభిమాన కథానాయకుడు మహేష్ బాబు పిలుపు మేరకు స్వచ్ఛంద సంస్థలకు వస్తువులు పంపిణీ చేశారు. జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థకు నెలరోజులకు సరిపడా సరకులను అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో వైకాపా శ్రేణులు సుమారు 2000 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా వ్యాప్తి నివారణపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా పెనుకొండలోని అల్ కౌసర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో 121 మంది నిరుపేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. నారాయణమ్మ కాలనీలో విశ్రాంత రైల్వే ఉద్యోగి రామచంద్ర ఆధ్వర్యంలో 300 మంది నిరుపేదలకు కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఫోటో, వీడియో గ్రాఫర్లకు వారి సంఘం తరఫున నిత్యావసరాల పంపిణీ చేపట్టారు.
కర్నూలు జిల్లాలో...
లాక్ డౌన్ నేపథ్యంలో ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులకు దాతలు ముందుకొచ్చి అన్నదానం చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఎమ్మెల్యే మోహన్ రెడ్డి వారికి భోజన ప్యాకెట్లను అందచేశారు. దాతలు ముందుకొచ్చి నిరాశ్రయులను ఆదుకోవాలని ఆయన కోరారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా దర్శిలోని ప్రభుత్వాసుపత్రిలో... కరోనా వ్యాప్తి విజృంభిస్తున్నా.. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యసేవలు అందిస్తున్న సిబ్బందికి బీవీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సరుకులను అందజేశారు. దర్శి సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందికి బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సంఘీభావం తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో పోలీసులకు ,ఆర్టీసీ సిబ్బందికి, పేద ప్రజలకు భోజనం, మజ్జిగ, తాగునీరు అందించారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని యూత్ సభ్యులు కోరారు.
విశాఖ జిల్లాలో...
విశాఖ జిల్లా వన్ టౌన్ ప్రాంతంలోని శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అభినందించారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌తో కలిసి ఆయన ఇవాళ వివేకానంద అనాధ ఆశ్రమాన్ని సందర్శించారు. కంచర్ల రామకృష్ణా రావు ట్రస్ట్ సహకారంతో విజయసాయి రెడ్డి చేతుల మీదుగా పేద ప్రజలకు పారిశుద్ధ్య సిబ్బందికి వాలంటీర్లకు బియ్యం బస్తాలు ,కందిపప్పు పంపిణీ చేశారు. వికలాంగ వృద్ధురాలికి వీల్‌చైర్‌ను అందజేశారు. దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ ప్రారంభించిన వివేకానంద సేవా సంస్థ సభ్యులు... నిరుపేదలు అనాధలు వృద్ధులకు ఆశ్రయం కల్పించి వారికి కుటుంబ సభ్యులు లేరనే బాధ లేకుండా చూసుకుంటున్నారని ఆయన కొనియాడారు.
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన పాయకరావుపేటలోని కుమార్‌పురం గ్రామస్థులకు ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆధ్వర్యంలో 2వేల మందికి నిత్యావసర సురుకులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: