పన్నెల గోపాలకృష్ణ, ఉమాదేవి దంపతులు ఇద్దరు పిల్లలతో కలసి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం బీఆర్‌టీ కాలనీలో ఉంటున్నారు. గోపాలకృష్ణ ఎన్‌టీపీసీలో కాంట్రాక్టు లేబర్. వారి కుమార్తె జాహ్నవి ఏడో తరగతి, కుమారుడు మణికంఠ రోహిత్ ప్రసాద్ నాలుగో తరగతి విద్యార్థులు. ఆదివారం ఉదయం భార్య, పిల్లలతో కలసి గోపాలకృష్ణ అత్తారింటికి బుచ్చయ్యపేట మండలం సీతయ్యపేట వెళ్తున్నామని చెప్పి ద్విచక్రవాహనంపై బయలుదేరారు.
తీరా సోమవారం కశింకోట మండలం అడ్డాం గ్రామ సమీపంలోని ఏలేరు కాలువలో రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయంత్రానికి బంధువులు వచ్చి పన్నెల ఉమాదేవి (34), జాహ్నవి (13) మృతదేహాలుగా గుర్తించారు. తండ్రి, కుమారుడి ఆచూకీ తెలియకుండా పోయింది. అనకాపల్లి గ్రామీణ సీఐ జి.శ్రీనివాసరావు.. బంధువుల నుంచి వివరాలు సేకరించారు. దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులే కారణమా.. మరేదైనా ఉందా?
గోపాలకృష్ణ కొంతకాలం అనకాపల్లిలోని వేల్పుల వీధిలో ఉండేవారు. అక్కడి నుంచి సుమారు 20 సంవత్సరాల కిందట బీఆర్‌టీ కాలనీలో ఇల్లు కట్టుకుని నివాసాన్ని మార్చారు. గత ఐదేళ్లుగా వీరు పప్పుల చీటీలు వేశారు. ఏడాది పాటు నెలనెలా డబ్బులు కట్టించుకుని సంక్రాంతి సమయంలో సరకులు అందించేవారు. ఐదేళ్ల నుంచి పప్పుల చీటీలు వేస్తుండడంతో నమ్మకం కలిగి సుమారు 1000 మంది వరకు ఈ ఏడాది వీరివద్ద చీటీలు కట్టినట్లు తెలిసింది.
అయితే సరకులు అందించాల్సిన సమయంలో డబ్బులు లేక వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరణానికి ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. బీఆర్‌టీ కాలనీ నుంచి అడ్డాం గ్రామ సమీపంలోని ఏలేరు కాలువ వద్దకు వీరు ఎందుకు వెళ్లారు? అక్కడే కాలువలో పడ్డారా? లేక ఇతర ప్రాంతంలో పడిపోతే అక్కడ తేలారా? అన్నది తెలియాల్సి ఉంది. గోపాలకృష్ణ సోదరుడు దుర్గాప్రసాద్ బీఆర్‌టీ కాలనీలోని వీరి ఇంటి పక్కనే ఉంటున్నారు. అతను గోపాలకృష్ణ, ఉమాదేవి ఫోన్ నంబర్లకు డయల్ చేస్తుండగా స్విచ్ ఆఫ్ అని వస్తోంది.
ఇదీ చదవండి:
ఇంజినీరింగ్, మెడికలే కాదు.. ఉజ్వల భవిష్యత్తుకు కోర్సులెన్నో..!