విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రజలను దశాబ్దాలుగా ఇబ్బందులకు గురి చేసిన విద్యుత్ కష్టాలు ఎట్టకేలకు తీరాయి. జిల్లాలోని నర్సీపట్నంలో ఏర్పాటుచేసిన 33/11కె.వీ విద్యుత్ ఉపకేంద్రంతో ఈ కష్టాలు తీరనున్నాయి. గతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచి పోవడం, లోవోల్టేజీ సమస్యలతో వినియోగదారులు అవస్థలకు గురయ్యేవారు. ఇప్పుడు అలాంటి అంతరాయాలు లేకుండా నిర్విరామంగా విద్యుత్ వెలుగులు ప్రసరిస్తుండటంతో... నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నర్సీపట్నంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో... గతంలో నాలుగు కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఇండోర్ సబ్ స్టేషన్ను నిర్మించారు. గ్రామీణ జిల్లాలో నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రాధాన్యత దృష్ట్యా... విశాఖ సిటీ తర్వాత ఇక్కడే ముందుగా దీన్ని ఏర్పాటు చేయడం విశేషం.
గతంలో కొరుప్రోలు ఆ తరువాత పెద్ద బొడ్డేపల్లి విద్యుత్ కేంద్రాల నుంచి నర్సీపట్నానికి విద్యుత్తు సరఫరా అయ్యేది. దీని వలన విద్యుత్ సమస్యలు నిత్యకృత్యం అయ్యేవి. అయితే ఇప్పుడు సమస్యలు తగ్గుముఖం పట్టాయి. కరోనా వైరస్ కారణంగా ఇండోర్ ఉపకేంద్రం నిర్మాణంలో జాప్యం జరిగింది. అయినప్పటికీ ఆగస్టులో పక్కాగా ఫీడర్లు ఏర్పాటుచేసి సాంకేతికంగా సబ్స్టేషన్ చార్జ్ చేశారు. నాలుగు నెలలుగా మెరుగైన సేవలు అందిస్తోంది. ఏళ్లతరబడి ఈ ప్రాంతం విద్యుత్ వినియోగదారులు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. సరఫరాలో అంతరాయాలు సమస్యలతో నిత్యం విసుగెత్తిపోయేవారు. ఈ పరిస్థితి వల్ల పట్టణంలో ఇన్వర్టర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. తరచూ సరఫరా నిలిచిపోవడంతో వినియోగదారుల కోపంతో విద్యుత్ అధికారులు, సిబ్బందితో గొడవలు పడేవారు. ఇప్పుడు మున్సిపాలిటీ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యలన్నిటికీ తెరపడింది.
ఈ ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రానికి ఇక ఎలాంటి డోకా లేదని... దీని పనితీరులో అన్ని అంశాలను ఇప్పటికే పరిశీలించామని విద్యుత్ అధికారులు నిర్ధరించారు. దీనివల్ల మున్సిపాలిటీలోని మూడు ఫీడర్ల పరిధిలో అన్ని కేటగిరీలలో సుమారు 9 వేల సర్వీసులకు చెందిన వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అప్పుడప్పుడు నిర్వహణ పనుల సమయంలో మాత్రమే కొంతసేపు సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: