విశాఖ, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో సీలేరు డొంకరాయి జలాశయానికి అర్దరాత్రి గండిపడింది. పక్కనే ఉన్న పోలీసుస్టేషన్ సిబ్బంది నీరు ప్రవహ శబ్దాన్ని గుర్తించి జెన్‌కో అధికారులకు తెలియజేశారు. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం నుంచి దిగువన ఉన్న పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి నీరు చేరుకుంటుంది. గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నుంచి నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈక్రమంలో పవర్ కెనాల్ భారీ కోతకు గురి కావడంతో మొదటి హెడ్ రీచ్ ఎక్విడేట్ మొదటి భాగం వద్ద పవర్‌కెనాల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో విద్యుదుత్పత్తి నిలిపివేసి, కెనాల్‌కు నీరు వెళ్లే గేటును మూసివేశారు. అప్పటికే గండిపడటంతో పవర్‌కెనాల్ నుంచి వస్తున్న నీరు కన్నబ్బాయి క్యాంపులోకి ప్రవేశించింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈలోగా అధికారులు ఇసుక బస్తాలతో గండిని పూడ్చివేసే ప్రయత్నం చేపట్టారు. పవర్‌కెనాల్‌కు నీటిప్రవాహం తగ్గినప్పటికీ, ప్రస్తుతం వస్తున్న నీటినిల్వలను ఎటు మళ్లించాలన్న విషయంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇదీ చూడండి:గోదావరి అందాలను డ్రోనుతో చూసేద్దాం