విశాఖ మారికవలస ఐటీ కంపెనీలకు వెళ్లే దారిలో ఉన్న గిరిజన పాఠశాలలో కొవిడ్ రోగులను ఉంచారు. అక్కడ వారికి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. బాధితులకు సరిపడినన్ని బెడ్లు లేవు.. తాగడానికి మంచినీరు లేదు.. పారిశుద్ధ్య సమస్యలు సరేసరి. కనీసం వారికి వైద్యం అందించడానికి అక్కడ ఒక్క వైద్యుడు కూడా లేడని బాధితులు రోదిస్తున్నారు.
మంగళవారం రాత్రి కరోనా పాజిటివ్ వచ్చిన రోగులను కొందరిని తీసుకువచ్చి గిరిజన పాఠశాలలో ఉంచారు సిబ్బంది. అక్కడ ఇద్దరు పోలీసులు తప్ప డాక్టర్ గానీ, వైద్య సిబ్బంది గానీ లేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగడానికి మంచి నీరు లేక నానా అవస్థలు పడుతున్నామని బోరుమంటున్నారు. నేలమీదే నిద్రించాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి.. సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: రెండు సంస్థలకు విద్యుత్ టారిఫ్లను తగ్గించిన ప్రభుత్వం