Clay Ganesh Idol Leaning to The Side: విశాఖలోని గాజువాకలో గణేశ్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన 89 అడుగుల భారీ వినాయక మట్టి విగ్రహం ఒక అడుగు మేర పక్కకు ఒరిగిపోయింది. దీంతో విగ్రహం ఎక్కడ కింద పడిపోతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మండపానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. వెంటనే ఆర్ అండ్ బీ అధికారులకు సమాచారం అందించారు. తనిఖీ చేసిన ఆర్ అండ్ బీ అధికారులు ప్రమాదానికి అవకాశాలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. నిత్యం వేలాదిగా ప్రజలు వినాయకుడిని దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో ఏ క్షణమైనా ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో విగ్రహానికి 100 మీటర్లలోపు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.
ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉన్నందున వెంటనే నిమజ్జనం చేయాల్సిందిగా.. ఉత్సవ కమిటీని పోలీసులు ఆదేశించారు. అయితే 18వ తేదీన నిమజ్జనం చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. ఇప్పుడు కుదరదని మొదటగా ఉత్సవ కమిటీ తెలిపింది. వర్షాలు కురుస్తున్నందున విగ్రహం పడిపోతుందని ఆర్ అండ్ బీ అధికారులు పేర్కొన్నారు. పోలీసులు, ఆర్ అండ్ బీ అధికారుల ఆదేశాల మేరకు దర్శనాలు నిలిపివేసిన నిర్వాహకులు సోమవారం సాయంత్రం నిమజ్జనం చేయనున్నట్లు వెల్లడించారు. అయితే.. ఈ విషయంపై కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: