విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు అన్ని ఈ నెల 20న విశాఖ వెళ్లి ఆందోళన చేపడతాయని సెంటర్ ఫర్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నేతలు తపన్ సేన్, విజూ కృష్ణన్, వెంకట్ దిల్లీలో మీడియాకు వెల్లడించారు.
ఎందరో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూస్తోందని వారు ఆరోపించారు. ప్రధాని మోదీ నేతృతంలోని కేంద్రం దేశాన్ని అమ్మకానికి పెడుతోందని.. పోరాటంతో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునేలా చేస్తామని తపన్ సేన్ హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని.. సీఎం జగన్ అన్ని పార్టీలను పిలిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వెంకట్ కోరారు. రైతులకు నష్టం చేసేలా సాగు చట్టాలు తెచ్చిన కేంద్ర సర్కారు.. ఇప్పుడు ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను మోసం చేస్తోందని విజుకృష్ణన్ మండిపడ్డారు.