NO RAILWAY ZONE : విశాఖ కేంద్రంగా.. రైల్వేజోన్ ఆశలు అడియాశలయ్యాయి. విభజన చట్టం ప్రకారం రైల్వేజన్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. మోదీ సర్కార్ గత ఎన్నికల ముంగిట అంటే.. 2019 ఫిబ్రవరి 17న అప్పటి రైల్వేమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుత మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం.. త్వరలో జోన్ ప్రారంభమవుతుందని స్థలమూ ఎంపిక చేశామని, కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెబుతూ వచ్చారు. ఐతే.. జోన్ కార్యకలాపాలు మొదలవుతాయని ఎదురుచూస్తున్న రాష్ట్రప్రజలకు.. రైల్వేబోర్డు ఎర్రజెండా చూపింది. కొత్త జోన్ ఏర్పాటు.. లాభదాయకం కాదంటూ బాంబుపేల్చింది.
విభజన హామీల అమలుపై కేంద్ర హోంశాఖ మంగళవారం దిల్లీలో నిర్వహించిన సమావేశానికి తెలుగు రాష్ట్రాల అధికారులతోపాటు..రైల్వే బోర్డు నుంచీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అందులో.. రైల్వేజోన్ అంశం చర్చకు రాగా.. కొత్త జోన్ ఏర్పాటు సాధ్యం కాదని, ఫీజిబులిటీ లేదని రైల్వే అధికారులు కుండబద్దలు కొట్టారు. అందుకే సంబంధిత డీపీఆర్‌కు ఇప్పటివరకు ఆమోదముద్ర వేయలేదని చెప్పినట్లు సమాచారం. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆధ్వర్యంలోని.. అధికారిక బృందం అభ్యంతరం వ్యక్తం చేశారని అధికార వర్గాలు తెలిపాయి.
ఫీజిబిలిటీ ఉంటేఏ చట్టంతో అవసరం లేకుండా రైల్వే శాఖే జోన్ ఏర్పాటు చేసేదని రైల్వే అధికారులు చెప్పగా ఫీజిబిలిటీ లేకపోయినా.. రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎన్నో జోన్లు ఏర్పాటు చేసిందని.. విశాఖ జోన్ ఏర్పాటులోనూ అదే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర అధికారులు కోరినట్లు సమాచారం. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి జోక్యం చేసుకుంటూ.. జోన్ ఏర్పాటు సాధ్యం కాదన్న నిర్ణయం మీ స్థాయిలోనే తీసుకొని పక్కన పెట్టొద్దని.. మంత్రివర్గం ముందుకు తీసుకెళ్తే ఏదో ఒక నిర్ణయం మంత్రివర్గమే తీసుకుంటుందని సూచించినట్లు తెలిసింది.
విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కలిపి దక్షిణకోస్తా జోన్ ఏర్పాటు చేయనున్నట్లు.. 2019 ఆగస్టులోనే అధికారులు రైల్వే బోర్డుకు డీపీఆర్ పంపారు. అప్పటి నుంచి.. తదుపరి నిర్ణయం కోసం రైల్వే అధికారులు ఎదురుచూస్తున్నారు. కొత్త జోన్ అమలు తేదీని ప్రకటిస్తే.. జనరల్ మేనేజర్, ఇతర అధికారుల నియామకాలు, కార్యాలయాల నిర్మాణం, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం వంటివి పూర్తవడానికి కనీసం రెండేళ్లు పడుతుందని అధికారులు గతంలో చెప్పారు. ఈ ప్రక్రియ మొదలవుతుందని నిరీక్షిస్తున్నవేళ.. అసలు జోన్ ఏర్పాటే ప్రశ్నార్థకం అనేలా రైల్వేబోర్డు చెప్పడం..తీవ్ర నిరాశపరిచింది.
మరోవైపు.. రాజధాని నిర్మాణానికి మరో వెయ్యి కోట్లు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు.. సమావేశంలో కోరారు. ఇప్పటికే ఇచ్చిన 15 వందల కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని హోం శాఖ అధికారులు స్పష్టం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ రాజధాని నిర్మాణానికి.. 29 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసిందని, అందుకు అనుగుణంగా ఆ నిధులు ఇవ్వాలని కోరగా.. హోం శాఖ అధికారులు ఎలాంటి స్పందన ఇవ్వలేదని రాష్ట్ర అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: