Central Election Commission Meeting With AP Districts Collectors on Voters List: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సహా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లోనూ వాలంటీర్ల సేవలు వినియోగించొద్దని.. CEC స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను భాగస్వాముల్ని చేస్తున్నట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్లను హెచ్చరించింది. ఏపీలో ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల విధుల్లో వాలంటీర్ల ప్రమేయం తదితర అంశాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులొస్తున్న నేపథ్యంలో చిన్న పొరపాటుకు కూడా ఆస్కారమివ్వొద్దని సూచించింది.
ఎన్నికల్లో డబ్బు ప్రభావం మిగతా రాష్ట్రాల కంటే ఏపీలో చాలా ఎక్కువగా ఉందని, డబ్బు పంపిణీ కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బూత్ స్థాయి అధికారులు చేపడుతున్న ఇంటింటి సర్వేలో అధికార పార్టీకి చెందిన బూత్ స్థాయి ఏజెంట్లనే అనుమతిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలవారిని రానివ్వడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో.. అన్ని రాజకీయ పార్టీల బూత్ ఏజెంట్లనూ తప్పనిసరిగా అనుమతించాలిని కలెక్టర్లను సీఈసీ ఆదేశించింది. ఏ రాజకీయ పార్టీకీ అనుకూలంగా వ్యవహరించొద్దని.. అది అధికారుల మెడకు చుట్టుకునేలా చేసుకోవద్దని సుతిమెత్తగానే హెచ్చరించింది.
ఓటర్ల నమోదు, తొలగింపు కోసం కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు గంపగుత్తగా దరఖాస్తులు చేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వొద్దని కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు సూచించింది. ఇలాంటివి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నాయో కన్నేసి ఉంచాలని నిర్దేశించింది. అయితే దీనికి సంబంధించిన డ్యాష్‌బోర్డు యాక్సిస్ ఇవ్వాలని కేంద్ర అధికారులను పలు జిల్లాల కలెక్టర్లు కోరారు. జాబితాలో నుంచి ఎవరైనా ఓటర్లను తొలగిస్తే వారికి కచ్చితంగా నోటీసులిచ్చి, వివరణ తీసుకోవాలని, తొలగించటానికి సహేతుకమైన కారణాలతో ప్రతిదీ పక్కా ఆధారాలతో రికార్డు ఉండాలన్నారు. సున్నా డోర్ నంబర్‌తో ఉన్న ఓటర్లు, ఒకే డోర్ నంబర్‌లో భారీగా ఉన్న ఓటర్ల చిరునామాలకు వెళ్లి ఆ లోపాలన్నింటినీ సరిచేయాలని కేంద్ర అధికారులు కలెక్టర్లకు సూచించారు.
ఓటర్ల జాబితాల నుంచి తొలగించే, చేర్చే ప్రతి ఓటుకు సంబంధించిన ఆధారాలు, వివరాలు పక్కాగా ఉండాలని సూచించారు. ఓటరు-ప్రజల నిష్పత్తి, లింగ నిష్పత్తి అసాధారణంగా ఉండకూడదని.. సహేతుక కారణాలు లేకుండా అలా ఎక్కడైనా ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటింటి సర్వే సహా ఓటర్ల నమోదు, మార్పు చేర్పులు వంటి అంశాలపై ఆర్వోలు, ఈఆర్వోలు తప్పనిసరిగా పరిశీలన చేయాలని, బీఎల్వోలుగా శాశ్వత ఉద్యోగులనే నియమించాలని స్పష్టం చేశారు.
ప్రతి మంగళవారం నియోజకవర్గ స్థాయిలో, బుధవారం జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని.. వాటిలో ఆ వారం రోజుల పురోగతి, మార్పుచేర్పులు, తొలగింపులకు వచ్చిన దరఖాస్తుల వంటి సమాచారాన్ని వారికి అందజేయాలని సూచించారు. డోరు నంబర్లు లేకపోవటం, ఓటరు జాబితాల్లో పేరు, ఇంటి చిరునామాలు, తండ్రి పేరు తప్పుగా ఉండటం వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టి సరిదిద్దాలని సూచించారు. యువ ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని.. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఆదివాసీలు, నిరాశ్రయులను కూడా ఓటర్లుగా చేర్చాలని కలెక్టర్లకు సూచించారు.