వైకల్యాన్ని ఆమె ఆధ్యాత్మికతతో ఎదుర్కొన్నారు. రిజర్వేషన్ ఉన్నా.. సాధారణ అభ్యర్థులతో పోటీపడి సర్కారు కొలువు సాధించి చూపారు. ఉపాధ్యాయురాలిగా 2 దశాబ్దాలుగా విద్యార్థులను సాన బెడుతున్నారు. ఇప్పుడు బ్రెయిలీ లిపిలో భగవద్గీత రచించి తన విలక్షణతను మరోసారి చాటారు.
వైకల్యం వెంటాడినా.. లక్ష్యాలు
విశాఖకు చెందిన ఉపాధ్యాయురాలు కొల్లూరు లక్ష్మీనారాయణమ్మ.. పుట్టుకతో అంధురాలు. వైకల్యం వెంటాడినా.. ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. ఉన్నతస్థాయికి చేరుకున్నారు. చదువుపైన ఆసక్తే అందుకు కారణమని చెబుతున్నారు లక్ష్మీనారాయణమ్మ. సాంఘిక శాస్త్రం, తెలుగు భాషలో బీఈడీ చదివిన ఆమె ఏయూలో ఎంఏ పూర్తి చేశారు. హిందీ, బెంగాలీ, సంస్కృతంలపై పట్టు సాధించారు. డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించి అంధుల కోటాలో మరొకరికి అవకాశం కల్పించడం విశేషం. తెలుగు భాషపై గల మమకారం వృత్తి జీవితంలో రాణించేందుకూ దోహదం చేసిందని ఆమె చెబుతున్నారు.
బ్రెయిలీలో భగవద్గీత
లక్ష్మీనారాయణమ్మ.. దండుబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 ఏళ్లుగా ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్నారు. దైవ ధ్యానమే ప్రవృత్తిగా మార్చుకున్న ఆమె... భగవద్గీత రచనను లక్ష్యంగా పెట్టుకొని.. సాధించారు. భగవద్గీత 18 అధ్యాయాలనూ 3 విడతల్లో పూర్తి చేశారు. మొదటి విడతగా 24 గంటల పాటు ఏకధాటిగా 5 అధ్యాయాలు అక్షరీకరించారు. రెండో విడతలో 26 గంటలకు పైగా శ్రమించారు. మూడోసారి 33 గంటల్లో 18 అధ్యాయాలూ పూర్తి చేశారు. ఈ క్రమంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సైతం దక్కించుకున్నారు.
భగవద్గీత బోధన
విద్యార్థులకు భగవద్గీత బోధించడాన్ని లక్ష్మీ నారాయణమ్మ అలవాటుగా మార్చుకున్నారు. నిహారిక అనే విద్యార్థినిని దత్తత తీసుకొని బాగోగులు చూసుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దేందుకు భగవద్గీత ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందనేది ఆమె విశ్వాసం.
ఇదీ చదవండి: తన పోలీస్ గారాలపట్టికి.. పోలీస్ నాన్న సెల్యూట్!