కాఫీ రుచుల్లో సరికొత్త బ్రాండ్ క్రియేట్ చేసుకుంటోంది అరకు కాఫీ. సాగరనగరి విశాఖలో కాఫీ ప్రియుల మనసు దోచుకుంటోంది. 'హట్ అరబికా' పేరుతో.. గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ కేంద్రం.. కాఫీ రుచుల్ని సరికొత్తగా అందిస్తోంది. ఇంతకాలం ఫిల్టర్ రుచులకే పరిమితమైన అరకు వ్యాలీ కాఫీ.. ఇప్పుడు 40 రుచులతో రారమ్మని ఆహ్వానిస్తోంది. గిరిజన ఉత్పత్తులకు బ్రాండింగ్ తెచ్చే దిశగా జీసీసీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే విశాఖ వాసులకు బీచ్ రోడ్డులోని జీసీసీ కార్యాలయం వద్ద అందుబాటులోకి వచ్చిన హట్ అరబికా... అనూహ్య ఆదరణ పొందుతోంది.
అరకు కాఫీగింజలతో చేసే హాట్... కోల్డ్ కాఫీలు.. హట్ అరబికాలో చాలా స్పెషల్. ఘుమఘుమలతో ఆకర్షించడమే కాదు.. మంచి రుచితో ఆహ్లాదాన్ని కల్పించడం వీటి ప్రత్యేకత. ఈ కారణంతోనే... నగరవాసులకు హట్ అరబికా ఎంతో చేరువ అవుతోంది. అంతేకాదు... తొలిసారిగా కాఫీ చాక్లెట్లనూ ఈ స్టాల్లో అందుబాటులోకి తెచ్చారు. ఇంకేముంది.... పెద్దలను కాఫీ రుచి మైమరపిస్తే... పిల్లలను చాక్లెట్లు నోరూరిస్తున్నాయి.
కాఫీ రుచులతో ఆకర్షిస్తూనే... వివిధ గిరిజన ప్రాంత ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ ప్రయత్నిస్తోంది. హట్ అరబికా కాఫీషాప్ విస్తరణకు సిద్ధమవుతోంది. నేచర్స్ బెస్ట్ పేరుతో రానున్న మరో కేంద్రంలో.. గిరిజన ఉత్పత్తులకు మరింత విలువ జోడింపు చేస్తూ ఆకర్షణీయంగా అందించబోతున్నారు. హట్ అరబికా విజయవంతమైనట్టే.. నేచర్స్ బెస్ట్నూ జనానికి చేరువ చేసి సక్సెస్ చేసే ప్రయత్నాల్లో ఉంది కార్పొరేషన్.