High court on Tobacco: ‘పొగాకు నమలడం’ ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006లోని సెక్షన్ 3(1)(జే)లో పేర్కొన్న ‘ఆహారం’ అనే నిర్వచనం కిందికి రాదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇది మానవులు ఆహారంగా వినియోగించినట్లు కాదని స్పష్టం చేసింది. పార్లమెంటు చట్టం చేసేటప్పుడు సైతం పొగాకు నమలడాన్ని ఆహారమనే నిర్వచనం కిందికి తీసుకురాలేదని పేర్కొంది. గుట్కా, పాన్‌మసాలా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తుల తయారీ.. నిల్వ, రవాణా, విక్రయిస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలువురిపై ఐపీసీ, ఎఫ్‌ఎస్‌ఎస్, సీవోటీపీఏ (సిగరెట్స్, ఇతర పొగాకు ఉత్పత్తులు, సరఫరా, వర్తక నియంత్రణ) చట్టాలకింద పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేసింది. మరికొన్ని కేసుల్లో ఐపీసీ, ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లను రద్దు చేసింది.
ఏపీ ఎక్సైజ్ చట్టం, ప్రొహిబిషన్ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లలో మాత్రం దర్యాప్తు కొనసాగించుకోవచ్చని పోలీసులకు స్పష్టం చేసింది. మరికొన్ని కేసుల్లో ఐపీసీ, ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లను రద్దు చేసింది. మాదకద్రవ్యాల నిరోధక చట్టం (ఎన్‌డీపీఎస్) కింద నమోదు చేసిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ డిసెంబరు 28న మొత్తం 130 కేసుల్లో ఈ మేరకు తీర్పునిచ్చారు. చట్టం చేసేటప్పుడు గమ్ నమలడం ఫుడ్ అనే నిర్వచనం కిందికి వస్తుందని పార్లమెంటు పేర్కొన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగానే పొగాకు నమలడాన్ని ఫుడ్ కిందికి తీసుకురాలేదని వాదనలు విన్న న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: CBN comments on early elections: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం.. ఎప్పుడైనా రెడీ : చంద్రబాబు