Andhra Medical College Centenary Celebrations: ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా అటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు పెద్దాసుపత్రిగా సేవలందిస్తున్న విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రికి అనుబంధంగా.. 1923లో ఆంధ్ర వైద్య కళాశాల (Andhra Medical College) ఏర్పాటైంది. నాడు 32 మంది వైద్య విద్యార్థులతో మొదలైన ఈ వైద్య కళాశాల దేశంలో ఏడోది కావడం విశేషం. ప్రస్తుతం 250 ఎంబీబీఎస్ సీట్లు, 350కి పైగా పీజీ సీట్లు కళాశాలకు ఉన్నాయి.
తొలుత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ వైద్య కళాశాల.. ప్రస్తుతం హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది. ఇక్కడ నుంచి వైద్య పట్టా పొందిన వారు దిల్లీ ఎయిమ్స్ డైరక్టర్‌గా, ఐసీఎంఆర్‌కు డైరెక్టర్ జనరల్‌గా పని చేసి గుర్తింపు పొందారు. భోపాల్ గ్యాస్ దుష్ప్రభావాలపై పరిశోధనలు చేసిన ఘనత ఈ వైద్యులదే. పలువురు ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పురస్కారాలను సైతం అందుకున్నారు.
ఆంధ్ర వైద్య కళాశాల.. వివిధ రాష్ట్రాల విద్యార్థులకు వేదిక!
Andhra Medical College 100 Years: 2017లో డాక్టర్ రాధ ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలోనే దేశ విదేశాల్లో ఉన్నతస్థానాల్లో స్థిరపడిన ఏఎంసీ పూర్వవిద్యార్థుల ఆర్థిక తోడ్పాటుతో.. వందేళ్ల ఉత్సవాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక భవన నిర్మాణం చేయాలని తలపెట్టారు. ఉత్తర అమెరికాలో స్థిరపడ్డ దాదాపు 2 వేల మంది పూర్వ విద్యార్థులు దాదాపు 30 కోట్లు, దేశీయంగా స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు మరో 20 కోట్ల రూపాయలు దీనికోసం సమకూర్చారు.
1.60 ఎకరాల విస్తీర్ణంలో ఐదు అంతస్తులతో అత్యాధునిక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏడు నెలల క్రితం పనులు ప్రారంభం కాగా, ఇప్పటికీ 80 శాతం పూర్తయ్యాయి. భూరి విరాళం అందించిన డాక్టర్ సదాశివరావు పేరును ఒక ప్లోరుకు పెడుతున్నారు. 20 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ఈ భవన నిర్వహణకు ఎలాటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ISO CERTIFICATION: విశాఖ ఆంధ్రా వైద్య కళాశాలకు ఐఎస్‌ఓ ధృవీకరణ
AMC Centenary Celebrations: పూర్వ విద్యార్థుల చేయూతతోనే కళాశాల ఆవరణలో క్లినికల్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 20 కోట్లు ఇచ్చేందుకు అంకానా ముందుకు వచ్చింది. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రబలే వ్యాధులకు కారణాలు తెలుసుకోవడంతోపాటు, ఔషధ ట్రయల్స్, వైద్య పరిశోధనలు ముమ్మరం కానున్నాయి. దీని నిర్వహణ మొత్తం పూర్వ విద్యార్థుల సంఘమే చూసుకుంటోంది.
మూడు రోజులపాటు జరిగే కళాశాల వందేళ్ల ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ శతాబ్ది ఫైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, ఇతర ప్రముఖులతో తెలుగు సాహితీ వైభవం పేరుతో ఈనెల 29 తేదీన ప్రత్యేక గోష్ఠి నిర్వహిస్తున్నారు.
అదే రోజు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో పాటల కచేరీ కూడా వందేళ్ల ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఏఎంసీలో వైద్య విద్యను అభ్యసించి దేశ, విదేశాల్లో స్థిరపడి కళాశాల ఖ్యాతిని ఇనుమడింపజేసిన వారి విశిష్టతను తెలియజేస్తూ.. ప్రత్యేక వీడియో రూపొందించి ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు.