ఈనెల 20న ఉదయం 6.30 గంటలు.. పాడేరు(ACB RAIDS IN PADERU) పట్టణంపై మబ్బుపట్టి చిన్నపాటి వర్షం పడుతోంది. గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కుమార్ ఇంటికీ రెండు వావానాల్లో కొంతమంది వచ్చారు. కొన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీడీఏ భవనంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్లారు. కంప్యూటర్ తెరిచి వారికి అవసరమైన నమాచారాన్ని సేకరించారు. అక్కడినుంచి కుమార్‌ను విశాఖకు తరలించారు. సుమారు రెండు గంటల పాటు ఈ హడావుడి నడిచింది. వారంతా పాడేరు వీడిన తర్వాత ఏసీబీ అధికారులని తెలిసింది.
విశాఖలో కొనసాగిన సోదాలు..
పాడేరు నుంచి అనిశా బృందం నేరుగా విశాఖలోని కుమార్ ప్లాట్‌కు(ACB RAIDS AT ITDA EE KUMAR HOUSE) వచ్చింది. ఈఈ సోదరుడు, అత్తవారి ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో 10 మంది ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఉదయం మొదలైన సోదాలు రాత్రి 8.30 గంటల వరకు కొనసాగాయి. ఆదాయానికి మించి రూ. 1.34 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. కాట్రెడ్డి వెంకట సత్య నాగేష్‌కుమార్ స్వస్థలం అనకాపల్లి. 1985లో టెక్నికల్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. 1997లో ఏఈగాను, 2005లో డీఈగాను, 2017లో ఈఈగాను పదోన్నతులు పొందారు.
ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల ఎస్‌ఈగా పదోన్నతి వచ్చింది. ఉత్తర్వులు అందకముందే ఏసీబీకి ఇలా చిక్కారు. గిరిజన సంక్షేమ శాఖలో ఏటా రూ. వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. ఇతర శాఖల మాదిరిగా ఇందులో బిల్లుల సమస్య పెద్దగా ఉండదు. ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వ నిధులు కావడంతో మన్యంలో పనులు ఏడాది పొడవునా జరుగుతుంటాయి. ఆయా పనుల విలువలో 10 నుంచి 15 శాతం ఇంజినీరింగ్ అధికారులకు ముట్టజెప్పాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. మారుమూల గ్రామాలు కావడంతో కొన్నిచోట్ల పనులు చేయకుండా కూడా బిల్లులు మార్చుకునేందుకు అవకాశాలున్నాయని సంబంధిత శాఖవారే చెబుతున్నారు. ఈ విధంగా సంపాదించిన సొమ్ముతో కుమార్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖలో మరికొందరిపైనా అనిశా నిఘా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
TRIBAL PRODUCTS: ముగిసిన జాతీయ గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సు