విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నక్కపల్లి-1సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీ గా గెలుపొందిన ఏనుగుపల్లి రత్నం..రిజర్వేషన్ ప్రకారం ఎంపీపీగా ఎన్నికయ్యే అవకాశాన్ని అధికార పార్టీ నుంచి పొందారు. కాగా ఈమె ప్రస్తుతం 9 నెల గర్భవతి.. ఆమెకు ఈ నెల 25వ తేదీన డెలివరీ అవుతుందని వైద్యులు తెలిపారు. ఎంపీపీ ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం కార్యాలయానికి రావడానికి సిద్ధమవగా స్వల్పంగా నొప్పులు వచ్చాయి. కొద్దిసేపటికి తగ్గుముఖం పట్టాయి. పరిస్థితిని అర్ధం చేసుకున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు.. అంబులెన్సు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేలోగా నొప్పులు వస్తే ఆసుపత్రికి తరలించడానికి ఈ ఏర్పాటు చేశారు.
ఈలోగా ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. ఎంపీపీగా రత్నం ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. బిడ్డొచ్చే వేళ పదవీయోగం ఆమెకి కలిగిందని అంతా ఆనందించారు. పదవిని అందుకున్న రత్నం పండంటి బిడ్డను ఎత్తుకునేందుకు ఎదురుచూస్తోంది.
ఇదీ చదవండి : Avanthi: పరిషత్ విజయం మాపై బాధ్యతను మరింత పెంచింది: అవంతి