Anakapalli jaggery flavours: బెల్లం వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ సుజాత. కష్టాల్లోనూ అవకాశాలను వెతుక్కున్నారు..ఎదురైన ఇబ్బందులను పరిష్కరించుకుని నిలదొక్కుకున్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో తయారు చేస్తున్న బెల్లంకు రోజురోజుకూ డిమాండ్ పడిపోతోంది. ఈ విపత్తు నుంచి బయట పడేందుకు కొత్త ఆలోచనను ఆచరణలో పెట్టి లాభాలబాట పట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సుజాత లాంటి వారు మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా మిగులుతారు.. స్పూర్తిదాయకంగానూ నిలుస్తారు అనడంలో సందేహం లేదు.
సేంద్రియ బెల్లానికే విలువ జోడిస్తే సిరులబాట.: మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో మనిషి విలువ ఉన్నతస్థితికి చేరుస్తుందని నిరూపించారు సుజాత.. కొత్త బాట వేయడంలో.. నడవడంలో ఎదురైన నష్టాలను భరిస్తూ ముందడుగు వేశారు..సాంప్రదాయ పద్ధతుల్లో సాగిపోయే బెల్లం వ్యాపారానికి సరికొత్త హంగులు అద్దారు.. మగవారికే పరిమితమైన బెల్లం వ్యాపారంలో నూతన వరవడికి నాంది పలికారు. బెల్లాన్ని సేంద్రియ పద్ధతిలో తయారు చేయడం.. ఆ సేంద్రియ బెల్లానికే ఇంకాస్త విలువ జోడించి రకరకాల ఉత్పత్తులను తయారు చేసి వినియోగదారుడికి రుచి చూపించి మెప్పించి అంతిమంగా తానూ లాభాల రుచి ఆస్వాదించడంలో విజయం సాధించారు.
మూస పద్ధతికి కాలం చెల్లింది..: అనకాపల్లి అంటే ఠక్కున గుర్తుకొచ్చేది బెల్లం. ఏళ్ల తరబడి మూసపద్ధతిలో ఒకేరకంగా తయారు చేస్తుండడంతో క్రమంగా ఈ బెల్లంకు డిమాండ్ పడిపోతోంది. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు బెల్లాన్ని సేంద్రియ పద్ధతిలో తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ సేంద్రియ బెల్లానికే ఇంకాస్త విలువ జోడించి రకరకాల ఉత్పత్తులకు నాంది పలికారు సుజాత. మొదట్లో ఈ ఉత్పత్తులు మాకొద్దని సూపర్ బజార్లు, మాల్స్ వెనక్కి పంపించేసేవి. కొవిడ్ నుంచి ఈ పరిస్థితి మారింది. బలవర్ధకమైన ఆహారానికి డిమాండ్ పెరగడంతో అప్పుడు వద్దన్నవారే ఇప్పుడు మరికొన్ని ఎక్కువ ఆర్డర్లు ఇస్తున్నారు. రూ.10 వేల పెట్టుబడితో మొదలైన వీరి వ్యాపారం నేడు రూ.కోటి వార్షిక టర్నోవర్‌కు చేరుకుంది. పదుల సంఖ్యలో కుటుంబాలకు ఉపాధినీ కల్పిస్తున్నారు సుజాత.
పౌష్టికాహారం తయారీకి ముడిసరుకుగా..: సుజాత అత్తవారి కుటుంబానికి అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో దుకాణం ఉండేది. ఇతర రాష్ట్రాలకు బెల్లం దిమ్మలు ఎగుమతి చేసేవారు. కొన్నాళ్లుగా చెరకులో దిగుబడులు తగ్గిపోయాయి. బెల్లం వ్యాపారం పడిపోతున్న తరుణంలో కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారు. బెల్లం తయారీలో రసాయనాల జోలికిపోకుండా దిమ్మల రూపంలో కాకుండా పౌష్టికాహారం తయారు చేసి అమ్మాలన్న ఆలోచన చేసారు. అప్పటివరకు ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేసిన సుజాత ఈ వ్యాపారం కోసం ఆమెకిష్టమైన వృత్తిని వదులుకున్నారు. పిల్లలు, గర్భిణిలు, బాలింతలు తినడానికి ఇష్టపడేలా పప్పుండలు, కొబ్బరి ఉండలు, అరిసెలు, సిమ్మిలి, పాకుండలు, మినపసున్నండలు, రాగి, ఉలవ లడ్డూలు, అవిశ గింజల లడ్డూలు ఇలా 40 రకాలు సేంద్రియ ఆహార ఉత్పత్తులు తయారు చేయడం మొదలుపెట్టారు.
బెల్లం ఉత్పత్తుల 'సూపర్' అమ్మకాలు..: సూపర్ బజార్‌లు, డిపార్డుమెంట్ స్టోర్లుకు బెల్లం సేంద్రియ ఆహార ఉత్పత్తులను పట్టుకుని వెళితే ఆదిలో తిరస్కారానికి గురయ్యామని చెబుతారు సుజాత. బెల్లంతో చేసిన సేంద్రియ ఆహార ఉత్పత్తులను అమ్మడం కష్టమని చెప్పేవారన్నారు. మొహమాటానికి తక్కువ స్టాక్ తీసుకుని వారం తిరగక్కుండానే వెనక్కి పంపించేసేవారు. ఎందుకిలా చేస్తున్నారని హతాశురాలైన సుజాత తానే స్వయంగా రంగంలోకి దిగారు. సూపర్ బజార్, మాల్స్‌లో నిలబడి వచ్చిపోయే వినియోగదారులకు తమ బెల్లంతో చేసిన సేంద్రియ ఆహార ఉత్పత్తుల విలువలను వివరించడం ఆరంభించారు. ఆయా ఉత్పత్తులను చూపించి రుచిచూసి నచ్చితే తీసుకోండని ఉచితంగా ఇచ్చేవారు. నష్టమైనా కొన్నిరోజుల పాటు అలానే ప్రచారం చేసారు. సుజాత శ్రమ ఊరకనే పోలేదు.. వీరి ఉత్పత్తులకు ఆదరణ పెరగడం మొదలైంది.
క్యూ వన్ ఇంటర్నేషనల్ ఆగ్రో ఫుడ్స్ పేరిట .: సూపర్ బజార్లు, మార్టులకు తోడు కుటీర పరిశ్రమగా ఉత్పత్తుల అమ్మకాలకు సిద్ధమయ్యారు. ఆర్గానిక్ స్టోర్లు కూడా సుజాతకి ఆర్డర్లు ఇవ్వడం పెంచాయి. తమ ఉత్పత్తులను దేశీయంగా మార్కెటింగ్ చేయాలని క్యూ వన్ ఇంటర్నేషనల్ ఆగ్రో ఫుడ్స్ పేరిట ఓ కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సుజాతే సీఈవోగా వ్యవహరిస్తూ ఆహార ఉత్పత్తుల తయారీ బాధ్యతను చూసుకుంటున్నారు. మార్కెటింగ్ బాధ్యతను తన భర్త శ్రీనివాసరావుకి అప్పగించారు.
కరోనాతో నష్టం పౌష్టికాహారంతో లాభం..: కరోనా కారణంగా చాలా వ్యాపారాలు నష్టపోయాయి. కానీ తమ వ్యాపారానికి కాస్త కలిసొచ్చిందనే చెబుతున్నారు సుజాత. తమ ఉత్పత్తుల్లో వ్యాధినిరోధక శక్తి ఎక్కువ ఉండడంతో కొవిడ్ సమయంలో ఎక్కువ వ్యాపారం జరిగిందన్నారు.క్రమంగా స్థానికంగా అమ్మకాలు పది రెట్లు పెరిగాయి. అలాగే హైదారాబాద్, దిల్లీలోను కొన్ని సూపర్ మార్కెట్‌లలో సుజాత తయారు చేస్తున్న బెల్లం ఉత్పత్తులను అమ్మకాలకు పెట్టి జాతీయంగానూ గుర్తింపు పొందారు. ఒకప్పుడు నెల మొత్తం మీద రూ.50 వేలు అమ్మడం కష్టంగా ఉండేది. ప్రస్తుతం రోజువారీ రూ.50 వేలు తగ్గకుండా వ్యాపారం చేయగలుగుతున్నారు.
మహిళలకు ఉపాధిని కల్పిస్తూ..: స్థానికంగా 26 మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నారు సుజాత. వీరి ఉత్పత్తులను ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేయడం కోసం ఆరిక ఆకుతో తయారు చేసిన ప్లేట్లు, వెదురు బుట్టలు, మట్టి కుండలను వాడుతున్నారు. దీనివల్ల చేతివృత్తుల వారికి కూడా పని కల్పించగలుగుతున్నామని సుజాత సంతోషం వ్యక్తపరిచారు. సంప్రదాయ వ్యాపారానికి భిన్నంగా తమ పంటకే విలువ జోడించి అమ్మకాలు చేపట్టడంతోనే గుర్తింపు వచ్చిందని సుజాత, ఆమె భర్త శ్రీనివాసరావులు చెబుతున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే తిరుగుండదని సుజాత ఉదంతం స్పష్టం చేస్తోంది.
ఇవీ చదవండి