TDP National Secretary Nara Lokesh met with Chenetha Karmikulu: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో నేడు చేనేత కార్మికులకు కీలక హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కుల వృత్తులను కాపాడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
చేనేత కార్మికులతో లోకేశ్ ముఖాముఖి.. టీడీపీ యువనేత నారా లోకేశ్ 'యువగళం' పేరుతో ఈ ఏడాది జనవరి 27వ తేదీన పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా ఆయన వివిధ కుల వృత్తుల కార్మికులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి.. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే కార్యక్రమాలను ప్రవేశపెట్టనున్నారో వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి క్యాంప్ సైట్ వద్ద చేనేత కార్మికులతో యువనేత లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
మాకు కేంద్ర సబ్సిడీలు అందటం లేదు.. ఈ సందర్భంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. హ్యాండ్ లూమ్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందడం లేదన్నారు. మగ్గం నేసే వారిని మాత్రమే చేనేత కార్మికులుగా గుర్తిస్తున్నారని.. నేతలో ఉన్న ఇతర కార్మికులను కూడా గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కూడా తమకు రావడం లేదని.. పలు సమస్యలను ఆయనకు వివరించారు.
ఒకే సంతకంతో రూ.110 కోట్ల చేనేత రుణాలు మాఫీ.. యువనేత లోకేశ్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉన్న అన్నీ కుల వృత్తులను కాపాడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. మంగళగిరిలో 'వీవర్స్ శాల' అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెంకటగిరిలో మెరుగైన మోడల్‌తో టెక్స్‌టైల్ పార్క్ తీసుకొచ్చి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఒకే సంతకంతో 110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసింది టీడీపీనే అని యువనేత గుర్తు చేశారు.
''ఆదరణ పథకంలో భాగంగా 50శాతం సబ్సిడీతో మగ్గాలు అందజేశాం. జగన్ వచ్చిన తరువాత చేనేతకు ఇచ్చే అన్ని సబ్సిడీలు రద్దు చేశారు. జగన్ పాలనలో 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ, ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదు. నేతన్న నేస్తం అంటూ చేనేతను జగన్ దారుణంగా మోసం చేశాడు. జగన్ పాలనలో ఆప్కోని బ్రష్టు పట్టించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులను దత్తత తీసుకుంటా.''-నారా లోకేశ్, టీడీపీ జాతీయ కార్యదర్శి