Vande Bharat Rail : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు ట్రాకులపై పరుగులు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య ఇప్పటికే ఈ హై స్పీడ్ ట్రైన్ నడుస్తోంది. త్వరలో సింకిద్రాబాద్ - తిరుపతి మధ్య కూడా మరో ట్రైన్ తిరగనుంది. అయితే తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ ఓ ఘనతను సాధించింది. వందేభారత్ రైలుకు విడిభాగాలు ఇక్కడి బీఎఫ్‌జీ ఇండియా పరిశ్రమలో ఉత్పత్తి అవుతుండటమే ఇందుకు కారణం.
ఈ కంపెనీ 2009 నుంచి పవన విద్యుత్, నిర్మాణ, రవాణా వంటి రంగాల్లోని పరిశ్రమలకు మిశ్రమ ఉత్పత్తులు, ప్రత్యేక ఆకృతులను తయారు చేస్తోంది. ప్రధానంగా మెట్రో కోచ్‌ల తయారీ సంస్థలైన ఆల్‌స్తోమ్, బొంబార్డియర్, వోల్వోలతోపాటు ఇండియన్ రైల్వేస్, జనరల్ ఎలక్ట్రికల్-ఎనర్జీ, గమేశ, కొచ్చిన్ షిప్‌యార్డు, థెర్మాక్స్ వంటి వివిధ సంస్థలు ఈ కంపెనీ సేవలను అందుకుంటున్నాయి. వందేభారత్ రైలులోని ఇంటీరియర్, టాయిలెట్ క్యాబిన్, ఇంజిన్ ముందుభాగాన్ని బీఎఫ్‌జీ సంస్థ సరఫరా చేస్తోంది.
ఒక్కో రైలు కోసం 329 రకాల ఫైబర్ రీ ఇన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్(ఎఫ్‌ఆర్పీ) ప్యానెళ్లను బీఎఫ్‌జీ సంస్థ తయారు చేసింది. ఇచ్చిన పనులను రికార్డుస్థాయిలో పది నెలల్లోనే పూర్తి చేసింది. దిల్లీ మెట్రో రోలింగ్ స్టాక్(కోచెస్) కోసం బొంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో దాని వ్యూహాత్మక సరఫరాదారుగా ఉంటూ... లోపలి, ముందు, వెనుకభాగాలు, డ్రైవర్ క్యాబ్‌లతోసహా ఎఫ్‌ఆర్పీ విడిభాగాలను సైతం బీఎఫ్‌జీ ఇండియా తయారు చేస్తోంది.
ఇవీ చదవండి: