TRAFFIC: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో నిన్న ఉదయం కళ్యాణి డ్యాం వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో.. ఆర్టీసీ బస్సును రోడ్డు పక్కకు తొలగించగా.. లారీని మాత్రం రోడ్డుపైనే ఉంచారు. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రావెల్ మెత్తబడి పోవడంతో.. ప్రమాదానికి గురైన లారీకి ఇరువైపులా వాహనాలు కూరుకుపోయాయి. ఒకవైపు కోళ్ల లారీ, మరోవైపు బియ్యం లోడుతో వస్తున్న లారీ కూరుకుపోయాయి. దీంతో తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు, రంగంపేట అటవీశాఖ అధికారులు.. ఘటనాస్థలానికి చేరుకుని బైక్‌లు, ఆటోలు, కార్లు వెళ్లడానికి అనువుగా రోడ్డును ఏర్పాటు చేసి రాకపోకలను క్రమబద్ధీకరించారు. భారీ వాహనాల రాకపోకలకు వీలు లేకపోవడంతో.. పాకాల, దామలచెరువు, కల్లూరు మీదుగా పీలేరు, మదనపల్లికి మళ్లించారు. నేలలో కూరుకుపోయిన లారీలను వీలైనంత త్వరగా తొలగించి.. వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చూస్తామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: వైఎస్ఆర్ పెళ్లి కానుక.. ఉత్తర్వులు జారీ అయినా అమలుకు నోచని పథకం!