MAN HOLE: తిరుపతి మ్యాన్‌హోల్ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. కార్మికులను కాపాడేందుకు మ్యాన్‌హోల్‌లో దిగిన లచ్చన్న.. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.
తిరుపతి ఘటనపై మంత్రి సురేష్ ఆరా: తిరుపతిలో పారిశుధ్య కార్మికుని మృతి లాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను హెచ్చరించారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించినట్లు తేలిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. పారిశుధ్య కార్మికులకు అందుబాటులో ఉన్న యంత్రాలు, వారికి ఇచ్చే పరికరాలు అన్నిచోట్ల ఉన్నాయా లేవా అని అధికారులను ప్రశ్నించారు. అన్ని పురపాలక సంఘాల్లో కార్మికుల ఆరోగ్య భద్రత రక్షణ కోసం చేపట్టిన చర్యలపై నివేదిక కోరారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందనీ స్పష్టం చేశారు.
నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మృతిచెందిన పారిశుద్ధ్య కార్మికులకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ జరిగింది..
తిరుపతిలో వైకుంఠపురం నుంచి తుమ్మలగుంటకు వెళ్లే దారిలో ఉన్న మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయాలని నగరపాలికకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఉదయం జెట్ వాహనంతో వచ్చారు. వీరిలో మహేష్ అనే కార్మికుడు ముందుగా గుంతలోకి దిగారు. కాసేపటికి ఊపిరాడక అందులోనే పడిపోయారు. అతను ఎంతసేపటికీ రాకపోవడంతో వాహన డ్రైవర్ ఆర్ముగం లోనికి వెళ్లారు. అతనూ బయటికి రాలేదు. ఇది గుర్తించిన లచ్చన్న అనే స్థానిక యువకుడు లోనికి దిగారు. అతను కూడా బయటకు రాలేదు. ఈ విధంగా లోనికెళ్లిన వారు ఎవరూ రాకపోవడంతో అక్కడే ఉన్న కార్మికులు అగ్నిమాపక, ‘108’ అంబులెన్సు సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
అగ్నిమాపక, నగరపాలిక సిబ్బంది కలిసి కమ్మితో ఒక్కొక్కరిని బయటికి తీశారు. అపస్మారకస్థితిలో ఉన్నవారిని రుయా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆర్ముగం(22)ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే మహేశ్(35) సైతం మృతిచెందారు. లచ్చన్నకు తిరుపతిలో చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ లచ్చన్న మృతి చెందాడు. ఆర్ముగం కుటుంబానికి నగరపాలిక సంస్థ కమిషనర్ రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు ప్రాథమిక బాధ్యులుగా నగరపాలిక ఏఈతోపాటు మరో అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆర్ముగంకు 10 నెలల కిందటే వివాహమైందని తోటి కార్మికులు చెప్పారు.
ఇవీ చూడండి: