Nara Lokesh 'Yuvagalam' 30th Day Padayatra Updates: 'యువగళం' పాదయాత్రలో నారా లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ కొనసాగుతూనే ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన కంపెనీలు, తెచ్చిన సంస్థల ముందు ఆయన సెల్ఫీలు దిగుతున్నారు. అనంతరం 'మేము తెచ్చినవి ఇవి,.. నువ్వు ఏం తెచ్చావు జగన్' అంటూ సెటైరిక్‌గా ప్రశ్నిస్తూ వస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో మంగళవారం పాదయాత్రగా వెళ్తూ ఐతేపల్లి వద్ద కాండోర్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు నారా లోకేశ్ సెల్ఫీ దిగారు. 70 ఏళ్లకి పైగా చరిత్రగలిగిన ప్రఖ్యాత విద్యా సంస్థ కాండోర్ టీడీపీ హయాంలోనే ఏర్పాటైందని గుర్తు చేశారు. ఈ సంస్థకు అప్పట్లో చంద్రబాబు సర్కారు 8 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. ఇప్పటివరకూ టీడీపీ కృషితో వచ్చిన ఉద్యోగ, ఉపాధి కల్పించే కంపెనీలు-సంస్థల ముందు లోకేశ్ ఫోటోలు దిగుతూ.. సీఎం జగన్‌కు ఛాలెంజ్‌లు విసిరారు. కాండోర్ ముందు సెల్ఫీ దిగిన అనంతరం 'ఇది మేము తెచ్చిన ప్రఖ్యాత విద్యా సంస్థ అని మేము గర్వంగా ప్రకటిస్తాము' అని లోకేశ్ పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 30వ రోజు కొనసాగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొంటూ.. మంగళ హారతులతో మహిళలు ఎక్కడికక్కడ స్వాగతం పలుకుతున్నారు. ప్రజల సమస్యలు వింటూ వాటి పరిష్కారానికి భరోసా ఇస్తూ, యువనేత ముందుకు సాగుతున్నారు. పాదయాత్రకు ముందు లోకేశ్ రజకులతో ముఖాముఖి నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజులలోపు రజక భవనాలకు భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం నడింపల్లి గ్రామస్థులతో లోకేశ్ మాటామంతీ నిర్వహించారు. వారి సమస్యలను విన్న యువనేత.. తమకు అన్ని విధాలగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కాశిపెంట్లలో మహిళలతో లోకేశ్ సమావేశమయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిత్యవసర వస్తువుల నుంచి గ్యాస్, బస్సు ఛార్జీలు అన్నీ పెరిగిపోయాయని మహిళలు వాపోయారు. టీడీపీ ప్రభుత్వం వస్తే వాటిని తగ్గిస్తారా? అని లోకేశ్‌ను ప్రశ్నించగా.. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జగన్ సర్కారు వచ్చాక అన్ని వర్గాల ప్రజలకూ ఇబ్బందులు తప్పడంలేదని యువనేత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా మంత్రులే మాట్లాడుతుంటే.. భద్రతను ఎలా ఆశించగలమని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణ కొరకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని నారా లోకేశ్ తెలిపారు.
ఇవీ చదవండి