Nara Lokesh Comments Jagan: సీబీఐ నుంచి అవినాష్‌రెడ్డిని కాపాడేందుకే జగన్ దిల్లీకి వెళ్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావటానికి దిల్లీ వెళ్లటం లేదని దుయ్యబట్టారు. యువగళం పాదయాత్ర నాలుగో రోజులో భాగంగా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగింది. నియోజకవర్గంలోని గాంధారమాకులపల్లెలో ఏర్పాటు చేసిన వడ్డెర సంఘం సమావేశం, తెలుగు యువత ఏర్పాటు చేసిన 'హలో లోకేశ్' కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గడిచిన మూడు సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను యువత లోకేశ్‌కు వివరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు కావటంతో కళాశాలలు వేలకు వేల ఫీజులు వసూలు చేస్తున్నాయని వాపోయారు. చదువుకున్నా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నామని.. భవిష్యత్‌కు మార్గం చూపెట్టాలని లోకేశ్‌ను కోరారు. దీనిపై స్పందించిన లోకేశ్ అధికారంలోకి రాగానే ప్రతియేటా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో కంపెనీలను తీసుకువచ్చి సూమారు 5లక్షల ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిని రివర్స్ గేర్ వేసి.. వెనక్కి తీసుకెళ్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తే యువతపై కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారన్నారు. యువత పోరాటానికి మద్దతుగా నిలబడేందుకే యువగళం కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు.
ప్రజల మధ్య ఉండాల్సిన ముఖ్యమంత్రి పరదాల చాటున తిరుగుతున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ఏపీకి రాజధాని ఉండాలన్న ముఖ్యమంత్రి.. అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో మోసం చేస్తున్నారని విమర్శించారు. దామాషా పద్దతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే అభివృద్ది వికేంద్రీకరణ అని అన్నారు. జగన్ మాత్రం ఆచరణకు సాధ్యం కాని మూడు రాజధానులు పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. దావోస్ పర్యటనకు వెళ్లి పరిశ్రమలు తీసుకురాలేని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్ అని ఎండగట్టారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్ ఈ రాష్ట్రానికి అవసరమా అని దుయ్యబట్టారు. దావోస్‌లో చలి ఎక్కువగా ఉందని వెళ్లలేదని మంత్రి చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు.
"కనీసం ఒక్క ఉద్యోగము ఇవ్వలేదు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయన్నాడు. ప్రత్యేక హోదా లేదు. ఉద్యోగాలు లేవు." - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి :