TDP Leaders Angry on MLA Chevireddy Bhaskar Reddy: చంద్రగిరిలో బరితెగించిన ఇసుక మాఫియాను అడ్డుకుని ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు 24మంది పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం శోచనీయమని టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొక్కల కుమారరాజారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారరాజా రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా 2019 ఎన్నికల తర్వాత స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు.
నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అక్రమ సంపాదనకు అనువైన భూదందా, ఇసుక గ్రావెల్ మాఫియాకు పాల్పడుతూ తన అక్రమ సంపాదనను పెంచుకోవడమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నాడని ఆయన ఆరోపించారు. రైతులు, గ్రామస్థులు గగ్గోలు పెడుతున్నా.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తున్నా.. చంద్రగిరి సమీపంలోని స్వర్ణముఖి వాగులో ఇసుక అక్రమ రవాణాను నిలపడం లేదని మండిపడ్డారు. అతను చేస్తున్న ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నిస్తే 24 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు.
తమ నాయకురాలు పులివర్తి సుధారెడ్డి సుమారు 6 గంటల పాటు చంద్రగిరి పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించడం వల్ల కేవలం కేసుతో సరిపెట్టారని.. లేకపోతే కార్యకర్తలు, నాయకులకు చిత్రహింసలు తప్పేమి కావని ఆయన అన్నారు. ఈ కుట్రలో మహిళలు, యువకులు పేర్లు కూడా చేర్చడం అన్యామని పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్స్ 143, 147, 341, 427, 436, 506, 149 నమోదు చేశారని అన్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయ పోరాటం చేసినందుకు మరో పది మందిపై కేసు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము కేసులకు భయపడబోమని.. ఎన్ని కేసులు పెట్టిన న్యాయపోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని గౌరవించి, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రశాంతంగా ఇసుక అక్రమ రవాణాపై పోరాటం చేస్తే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
ఇసుక తరలింపుకు భారీ యంత్రాలు ఉపయోగించకూడదన్న నిబంధనలు ఉన్నా కూడా వాటిని గాలికి వదిలి.. భారీ యంత్రాలతో టిప్పర్ల సాయంతో ఏథేచ్చగా ఇసుక అక్రమ రవాణా కొనసాగించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే, వారి అనుచరులకు గుణపాఠం చెపుతామని వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆస్తుల విలువెంత ఉండేది.. ఈ రోజు ఆస్తుల విలువెంత ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. గతంలో ఎమ్మెల్యేలు గ్రామాల్లో సమస్యలు పరిష్కారించడం, ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంపై దృష్టి సారించేవారని.. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నియోజకవర్గంలోని సహజ సంపదను దోచుకుని రాజకీయ లబ్ధి పొందుతున్నారని అన్నారు.
ఎమ్మెల్యే వేల కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలు నిజం కావని నిరూపించుకోవాలంటే.. చంద్రగిరి శ్రీమూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో ప్రమాణానికి సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించకుంటే నువ్వు తప్పు చేసినట్టే అని నిర్ధారించుకోవాల్సి వస్తుందని కుమార రాజారెడ్డి వ్యాఖ్యానించారు.