NARA LOKESH YUVAGALAM PADAYATRA : రాష్ట్రంలో యువత, మహిళలకు.. భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. గత నెల జనవరి 27న చేపట్టిన పాదయాత్ర నేటికి 22వ రోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి తీవ్ర ఉద్రిక్తతల మధ్య శ్రీకాళహస్తిలోకి లోకేశ్ పాదయాత్ర ఎంటర్ అయ్యింది.
శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు విధించారు. పట్టణంలో పాదయాత్రను జరగకుండా ఉండేందుకు పోలీసులు లక్ష్మీపురం కూడలి వద్ద భారీగా మోహరించారు. కాళహస్తి పట్టణానికి శివార్లలోని రామాపురం, ముసలిపేడు, తొండమనాడు మీదుగా తిరుపతి రోడ్డు వైపు పాదయాత్ర మళ్లించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే పట్టణంలోకి వెళ్లకుండా శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా లోకేశ్ పాదయాత్ర సాగనుంది. ఎన్టీఆర్ విగ్రహం మీదుగా కొత్తపేట, భాస్కర్‌పేట, వి.ఎం.పల్లి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది
పాదయాత్ర అనంతరం లోకేశ్ బస చేసే ప్రాంతం ఆలయానికి సమీపంలో ఉండకూడదని సైతం పోలీసులు నిబంధనలు విధించారు. మొదట పొన్నాలమ్మ గుడి వద్ద బస ఏర్పాట్లు చేస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు.. గుడికి దగ్గరలో బస ఉండొద్దని స్పష్టం చేశారు. దీంతో గుడికి 3 కి.మీ. దూరంలోని పానగల్ సమీపంలో లోకేశ్ రాత్రి బసకు తెలుగుదేశం శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే శివరాత్రి భక్తుల రద్దీ దృష్ట్యా లోకేశ్ శ్రీకాళహస్తి పాదయాత్రపై చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
అయితే మొదటి నుంచి లోకేశ్ పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి నేటీ వరకూ ప్రతి చోటా అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ముందుగా అనుమతి ఇచ్చి ఇప్పుడు శ్రీకాళహస్తిలోకి ప్రవేశం లేదని చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్న నారా లోకేశ్ పాదయాత్ర ఆగే ప్రసక్తే లేదని.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర సాగుతుందని స్పష్టం చేశారు. జనవరి 27న పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్ అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని.. వారికి భరోసా కల్పిస్తున్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ అధికార పక్షంపై తీవ్రస్థాయిలో గళమెత్తుతున్నారు.
ఇవీ చదవండి: