School roof falls off: తిరుపతి బైరాగిపట్టెడలోని మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో తృటిలో ప్రమాదం తప్పింది. పాఠశాలలోని భౌతిక శాస్త్ర ప్రయోగశాల భవనం పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడింది. ప్రమాదంలో ఒక విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు లేకపోవడంతో 9వ తరగతి విద్యార్ధులు 35 మందికి ప్రయోగశాలలో పాఠాలు బోధిస్తున్నారు. ఉదయం విరామ సమయంలో విద్యార్థులు బయటకు వెళ్లగా.. నలుగురు విద్యార్థులు తరగతి గదిలోనే చదువుకుంటున్నారు. ఈ సమయంలో పైకప్పు నుంచి సిమెంటు పలకలు విరిగి విద్యార్థులపై పడ్డాయి. జస్వంత్ అనే విద్యార్థి తలపై శిథిలాలు పడి తీవ్రంగా గాయపడటంతో ఉపాధ్యాయులు స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన మిగతా ముగ్గురికి పాఠశాల వద్దే చికిత్స అందించారు.
30 ఏళ్ల నాటి మహాత్మాగాంధీ నగరపాలక ఉన్నత పాఠశాలను నాడు-నేడు పథకంలో భాగంగా 60 లక్షల రూపాయలు వెచ్చించి ఇటీవలే ఆధునీకరించారు. పనుల్లో నాణ్యత లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: