LOKESH MEETING WITH RAJAKULU IN YUVAGALAM : బీసీల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్ధను ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 30వ రోజు చంద్రగిరిలో కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా బస చేసిన మామండూరు విడిది కేంద్రంలో రజక సామాజిక వర్గంతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. పాదయాత్ర సందర్బంగా సంఘీభావం తెలపడంతో తనను వేధిస్తున్నారని శ్రీకాళహస్తికి చెందిన ముని రాజమ్మ అనే మహిళ లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాళహస్తిలో పాదయాత్ర జరిగిన సమయంలో మీతో మాట్లాడినందుకు వైసీపీ కార్యకర్తలు, నేతలు వేధిస్తున్నారని ముని రాజమ్మ వాపోయారు.
ఉపాధి కోసం ఏర్పాటు చేసిన తోపుడు బండిని ధ్వంసం చేశారని లోకేశ్‌కు వివరించారు. మునిరాజమ్మకి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. రజక సామాజిక వర్గానికి చెందిన ముని రాజమ్మపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రజక సామాజిక వర్గాన్ని అన్ని విధాలా ఆదుకున్నామని గుర్తు చేశారు. రజక సామాజిక వర్గంపై జగన్ పాలనలో వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు.
"ఇప్పటివరకూ శాసనసభ, శాసనమండలిలో ఒక రజక నాయకుడు అడుగు పెట్టలేదు. ఆ చరిత్ర తిరగరాయలన్న లక్ష్యంతో దువ్వాపు రామారావును ఎమ్మెల్సీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి వచ్చి చాలా హామీలు ఇచ్చారు. రజకులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. అవసరమైన నిధులు కేటాయించి.. మిమ్మల్ని అభివృద్ధి చేస్తానన్నారు. నేను ఒప్పుకుంటా కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. కానీ కార్పొరేషన్ ఛైర్మన్ల పరిస్థితి ఘోరంగా ఉంది. అమరావతిలో ఆఫీసు లేదు. కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లకు జీతాలు ఇచ్చి ఆరు నెలలు దాటింది. రజకులను ఎస్సీల్లో చేర్చాలన్న డిమాండ్‌ను.. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని హామీ ఇస్తున్నా"-నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని.. రూపాయి నిధులు ఇవ్వని కార్పొరేషన్ అవసరమా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రజకులను ఎస్సీల్లో చేర్చే అంశాన్ని పట్టించుకోలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టులు ఇస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోపు రజక భవనాలకు భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: