NARA LOKESH MET VANYAKULA KSHATRIYAS: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీ కార్పొరేషన్లను పునఃనిర్మాణం చేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. రెండు రోజుల విరామం అనంతరం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 23వ రోజు యువగళం పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం బండారుపల్లిలో వన్యకుల క్షత్రియులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. వైఎస్సార్సీపీ పాలనలో వన్యకుల కార్పొరేషన్‌కు ఛైర్మన్ ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కార్పొరేషన్ ఛైర్మన్లు కూర్చునేందుకు కార్యాలయాలు, కుర్చీలు లేకుండా చేశారని ఆరోపించారు.
రాజకీయంగా వన్యకులస్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని.. అది గతంలో చేశామని.. భవిష్యత్తులోనూ చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్దిని వివరించారు. తెలుగుదేశంలో పదవులు అనుభవించిన వాళ్లు పార్టీని వదిలి వెళ్లిపోయి.. ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయడం అన్యాయమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సత్యపాల్ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
వన్యకుల క్షత్రియులను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని.. నియోజకవర్గం, పార్లమెంట్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని పదవులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గన్నవరంలో బీసీ నాయకుడిపై దాడి, వాహనాన్ని తగలబెట్టింది వైసీపీ వాళ్లేనని ఆరోపించారు. తమ బీసీ నాయకుడిపైనే వైసీపీ వాళ్లు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని.. ఇదేనా జగన్‌రెడ్డికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని నారా లోకేశ్ ప్రశ్నించారు.
మైనార్టీలకు అన్యాయం: వైసీపీ హయాంలో ముస్లింలకు అన్యాయం జరిగిందని నారా లోకేశ్ ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా మైనారిటీ నాయకులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. మైనారిటీల్లో పేదరికాన్ని గుర్తించిన ఎన్టీఆర్.. మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక మైనారిటీ కార్పొరేషన్ తీసేశారని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే తిరుపతి పార్లమెంట్లో మహిళలకు రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
లోకేశ్ యువగళం @ 300కిలో మీటర్లు: నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 23వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానుపురం పంచాయతీలో పాదయాత్ర 300 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. దీంతో గ్రామంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలో 13 గ్రామాల దాహార్తి తీర్చే రక్షిత మంచి పథకాన్ని టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని లోకేశ్ ప్రకటించారు. 23వ రోజు పాదయాత్రలో లోకేశ్ 16.7 కిలోమీటర్లు నడిచారు. శ్రీకాళహస్తి మండలం పానగల్ నుంచి ఏర్పేడు మండలం కోబాక వరకు పాదయాత్ర కొనసాగింది.
ఇవీ చదవండి: