SHIVRATRI BRAHMOTSAVALU : రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలు శివనామస్మరణతో హోరెత్తుతున్నాయి. పలు శివాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గాంధర్వ రాత్రిని పురస్కరించుకొని సర్వేశ్వరుడు రావణ వాహనంపై, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి అమ్మ వారు మయూర వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
శ్వేత వర్ణ పుష్పాలంకరణలతో, విశేష దివ్యాభరణాలతో సర్వాంగ సుందరంగా ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారి వెంట జ్ఞానాంబిక నడవగా ముందు శివపరివారమైన వినాయక స్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేతుడైన సుబ్రహ్మణ్యం స్వామి చండికేశ్వరుడుతో కలిసి ఉత్సవ మూర్తుల ముందుకు కదిలారు. ఆది దంపతులను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కర్పూర నీరాజనాల సమర్పించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రం భక్తజనంతో కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. నల్లమల కొండల నుంచి భక్తులు పాదయాత్ర చేసుకుంటూ శ్రీ గిరికి చేరుకుంటున్నారు. శ్రీశైల గిరిలు శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. పాదయాత్రగా వచ్చిన భక్తులు శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ఆలయం వెలుపలి ప్రాంగణాల్లో సేద తీరుతున్నారు.
స్వామి వార్ల లడ్డు ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. లడ్డు కౌంటర్ల విక్రయానికి దేవస్థానం 15 కౌంటర్లను ఏర్పాటు చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రాత్రి 7 గంటలకు శ్రీ స్వామి, అమ్మవార్లకు గజవాహన సేవ జరగనుంది. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన తరువాత శ్రీగిరి పురవీధుల్లో భక్తజన సందోహం మధ్య గ్రామోత్సవం జరగనుంది.
తిరుపతిలో శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు శ్రీ కామాక్షి సమేత సోమ స్కంధమూర్తి స్వామి వారు వ్యాఘ్ర వాహనంపై అధిరోహించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. గజరాజులు, అశ్వాలు ముందు నడవగా వాహన సేవ నగర వీధులలో ముందుకు సాగింది. భక్తుల నమఃశివాయ నామస్మరణకో తిరుపతి నగర వీధులు మారు మ్రోగుతున్నాయి. స్వామి వారికి భక్తులు కర్పూర హరతులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. భజనమండళ్ల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
ఇవీ చదవండి: