Rains in Andhra Pradesh: తిరుపతిలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జనజీవనం స్తంభించింది. నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిడటంతో విద్యుత్ తీగలు తెగిపడి గంటల తరబడి సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. ఇరవై నిమిషాల వ్యవధిలోనే భారీ వృక్షాలు, కరెంట్ స్థంభాలు, హోర్డింగులు నేలకొరిగాయి. యర్రావారిపాళ్యం, చిన్నగొట్టిగల్లు మండలాలాల్లో ఈదురు గాలులకు మామిడి రైతులు నష్టపోయారు.
చెర్లోపల్లి నుంచి చంద్రగిరి, శ్రీనివాసమంగాపురం మార్గంలో చెట్లు నెలకొరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పెరుమాళ్లపల్లి వద్ద కారుపై విద్యుత్ స్థంభం పడడంతో ధ్వంసమైంది. కాలూరు క్రాస్ వద్ద 80 ఏళ్ల నాటీ భారీ వృక్షం రోడ్డుపై పడడంతో తిరుపతి-చంద్రగిరి మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుపతి నుంచి చెర్లోపల్లి మీదుగా సుమారు 20 మంది భక్తులతో శ్రీవారిమెట్టు వద్దకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంకటగిరిలోనూ మోస్తరు వర్షం కురిసింది.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. వీధుల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. డ్రైనేజీలు, కాలువలు పొంగి పొర్లడంతో రోడ్లు జలమయమయ్యాయి. కనిగిరిలో ఓ మోస్తరు వర్షం కురవగా....పామూరు, హనుమంతునిపాడు మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వాన పడింది. బాపట్ల జిల్లా చీరాల, పర్చూరు, మార్టూరు, చినగంజాం ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది.
మార్టూరులో కురిసిన వర్షంతో విద్యుత్ సరఫరాకు స్వల్పంగా అంతరాయం కలిగింది. చినగంజాంలో కల్లాల్లో ఉన్న ఉప్పు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీవర్షం పడింది. నరసరావుపేట - పిడుగురాళ్ల మార్గంలోని నకరికల్లు మండలం దేచవరం మిద్దె వద్ద చెట్టు విరిగిపడి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు మూడు గంటలకుపైగా ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అద్దంకి - నార్కట్‌పల్లి హైవేపై వరదనీరు పొంగిపొర్లింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో రైతులు నష్టపోయారు. వీరులపాడు మండలం వెల్లంకిలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కంచికచర్ల మండలం పేరకలపాడు లో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో గేదె చనిపోయింది. చందర్లపాడు తుర్లపాడులో చెట్లపై మూడు చోట్ల పిడుగులు పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కురిసిన వర్షంతో పలు చోట్ల చెట్లు వరి పంట నేలకొరిగింది.
కొనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో భారీ వర్షానికి పొలాల్లో వరి నేలవాలింది. కల్లాలలో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు. ఏంచేయాలో పాలుకోవడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లాలోని, గుంతకల్లు, పామిడిలో వర్షం ధాటికి 5గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మురుగు నీరు రోడ్లపైకి చేరి ప్రవహించడంతో వాహన దారులు అనేక ఇబ్బందులు పడ్డారు.పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.
Weather Updates: దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలియజేసింది. రాగల 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని శుక్రవారం తెలిపింది. వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు- కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశముందని ఐఎండీ చెప్పింది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగానే వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలియజేసింది. మరోవైపు ఉష్ణోగ్రతల ప్రభావంతో ఏర్పడిన క్యుములో నింబస్ మేఘాల కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని స్పష్టం చేసింది. వాయుగుండం ప్రభావంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచనలు జారీ చేసింది. కాగా.. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.