మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల.. హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అపోలో ఆస్పత్రి నుంచి బొజ్జల భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసానికి కుటుంబ సభ్యుల తరలించారు. రాత్రి లేదా రేపు ఉదయం స్వగ్రామానికి బొజ్జల పార్థివదేహం తరలించనున్నారు. కార్యకర్తల సందర్శన కోసం ఊరందూరులో బొజ్జల భౌతికకాయం ఉంచనున్నారు. అనంతరం ఎల్లుండి బొజ్జల అంత్యక్రియలు నిర్వహించునున్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాశహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామంలో 1949 ఏప్రిల్ 15న బొజ్జల జన్మించారు. శ్రీకాళహస్తి నుంచి 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994,1999,2009,2014 వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 ,2004 మధ్య ఐటీ, రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.
2014లో ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి గెలుపొందిన బొజ్జల 2014-19 కాలంలోనూ మధ్య మంత్రిగా పనిచేశారు. అలిపిరి బాంబు పేలుడు ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో బొజ్జల-గాలి ముద్దు కృష్ణమనాయుడిది మంచి జోడిగా పేరొందారు. 2004-2014 మధ్య తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొజ్జల-గాలి ముద్దు కృష్ణమనాయుడుని "చిత్తూరు బ్రదర్స్" అంటూ పార్టీ నేతలు ఆత్మీయంగా పలకరించేవారు. బొజ్జలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆప్తమిత్రులు.