Controversy Over Demolition of Ancient Mandapam in Tirumala: టీటీడీలో కొత్త వివాదం మొదలైంది. పునర్నిర్మాణాల పేరుతో పురాతన కట్టడాల కూల్చివేత తీవ్ర వివాదాస్పదమవుతోంది. తిరుమల పార్వేట మండపం కూల్చివేసి పునర్నిర్మాణం చేయగా తాజాగా అలిపిరి పాదాల మండపం వద్ద విశ్రాంతి మండపం తొలగించాలని నిర్ణయం తీసుకొన్నారు. టీటీడీ నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పురాతన నిర్మాణాలను ఇష్టానురీతిలో తొలగిస్తున్నారని టీటీడీపై మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరుకోవడంతో తొలగించి పునర్నిర్మాణాలు చేస్తున్నామంటూ ఇటీవల టీటీడీ తీసుకొంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి.
శిధిలావస్థలో ఉన్న మండపాల పునరుద్ధరణ - తమకు సంబంధం లేదన్న పురావస్తు శాఖ
ఆర్కియాలజీ నిర్దేశం ప్రకారం నిర్ణయాలు తీసుకొవాలి.. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కట్టడాలను కూల్చివేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఐదు శతాబ్ధాల చరిత్ర కలిగిన తిరుమల శ్రీవారి పార్వేట మండపాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మించారు. గొల్ల మండపం తొలగించడానికి ప్రయత్నించారు. యాదవ సంఘం ఆందోళనకు దిగడంతో గొల్లమండపం తొలగింపు ప్రతిపాదన ఉప సంహరించుకొన్నారు. తాజాగా అలిపిరి నడక దారిలో భక్తుల విశ్రాంతి మండపం తొలగించాలని నిర్ణయం తీసుకొన్నారు. పురాతన కట్టడాలపై ఆర్కియాలజీ నిర్దేశం ప్రకారం టీటీడీ అధికారులు నిర్ణయాలు తీసుకొవాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు.
'అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణ అందుకే' - డిసెంబర్ 23నుంచి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం : టీటీడీ ఈవో
కోటి 36 లక్షల రూపాయలతో కొత్త మండపం నిర్మాణ పనులు.. అలిపిరి వద్ద నడక దారికి ఇరువైపులా భక్తులు విశ్రాంతి తీసుకోవడం కోసం నిర్మితమైన ప్రాచీన మండపాలలో ఒకటి మరమ్మతులకు కూడా వీలుకానంతగా కట్టడం దెబ్బతిన్నదని ఇంజనీరింగ్ అధికారులు నివేదిక ఇవ్వడంతో కూల్చివేసి కొత్త మండపం నిర్మిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. కోటి 36 లక్షల రూపాయలతో కొత్త మండపం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. పురాతన కట్టడాలను భారత పురావస్తు శాఖ అనుమతి లేకుండా కూల్చివేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.. పురాతన కట్టడాల తొలగింపు విషయంలో ఆర్కియాలజీ శాఖ సూచనలను టీటీడీ పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి.
మండపం నిర్మాణాలపై పురావస్తుశాఖకు లేఖ.. పురావస్తు ప్రాధాన్యత కలిగిన కట్టడాలు, వస్తువులకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లడం తప్పనిసరైనా టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో టీటీడీ అధికారులు స్పందించారు. అలిపిరి కాలినడక విశ్రాంతి మండపం నిర్మాణాలపై పురావస్తుశాఖకు లేఖ రాస్తామని తెలిపారు పురావస్తు శాఖ అధికారులతో మాట్లాడామని తెలిపారు. పురావస్తు శాఖ వారు వచ్చి మండపాలను నిర్మిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. 2019 నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1600 ఆలయాలు నిర్మించామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.