TTD EX-Chairman Putta Sudhakar: గత కొంత కాలంగా తిరుమలలో సౌకర్యాల కల్పన పేరుతో తితిదే వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా అద్దెగదుల అధునీకరణ కార్యక్రమం చేపట్టింది. అనంతరం తిరుమలలోని గదుల రేట్లను ఒక్కసారిగా అమాంతం పెంచింది. ఈ పెంపును నిరసిస్తూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గదుల రేట్ల పెంపుపై బీజేపీ ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని వివిధ కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించాయి.
తిరుపతి జిల్లా: తిరుమలలో గదుల అద్దె పెరుగుదలను నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తితిదే పెంచిన గదుల అద్దె తగ్గించాలని కోరుతూ డీఆర్‍ఓకు వినతిపత్రం అందజేశారు. పెంచిన గదుల అద్దె ధరలను తితిదే వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పేద హిందువులను దేవాలయాలకు దూరం చేయరాదన్నారు. భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో తితిదే విఫలమైందని ఆరోపించారు.
రాజమహేంద్రవరం: వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో అతిథి గృహాల ధరలు భారీగా పెంపును నిరసిస్తూ రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద బీజేపీ ధర్నా నిర్వహించింది. ధర్నాలో సోము వీర్రాజు పాల్గొన్నారు. ధరల పెంపును వ్యతిరేకిస్తూ భాజపా నాయకులు నినాదాలు చేశారు.
విశాఖ: విశాఖలో జరిగిన ఆందోళనలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. సీఎం జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నాడని అనంతపురంలో బీజేపీ నేతలు ఆరోపించారు. తితిదేలో అద్దె భవనాలకు ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
నెల్లూరు జిల్లా: తిరుమలలో ధరల పెంపును నిరసిస్తూ నెల్లూరులో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని పెంచిన అద్దె ధరలను తగ్గించేలా చూడాలన్నారు. గదుల నిర్వహణకు అయ్యే ఖర్చు దాతల నుంచి వస్తుండగా ధరలను పెంచి భక్తుల నుంచి దోపిడీ చేసే విధానం మానుకోవాలని హితవు పలికారు.
తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్: జగన్ రెడ్డి తిరుమల క్షేత్రాన్ని వ్యాపారకేంద్రంగా మార్చాడని తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ధ్వజమెత్తారు. హిందూధర్మం తెలియని వ్యక్తి ఛైర్మన్ కావడమే భక్తులకు శాపమని ఆయన అన్నారు. తిరుమల క్షేత్రాన్ని జగన్ అండ్ కో దారిదోపిడీ కేంద్రం చేశారని మండిపడ్డారు. భక్తులు స్వామివారికిచ్చే కానుకలు, ఆస్తుల లెక్కల్లో చూపడం లేదని విమర్శించారు. గదుల అద్దెను పెంచి, భక్తుల నుంచి తీసుకునే అడ్వాన్స్ సొమ్ము తిరిగివ్వడం లేదన్నారు. తితిదే తక్షణమే గదుల అద్దెలు తగ్గించి, అడ్వాన్స్ సొమ్ము తిరిగివ్వాలని, భక్తులకు సకాలంలో స్వామివారి దర్శనం లభించేలా ఏర్పాట్లు చేయాలని పుట్టా సుధాకర్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: