ALLEGATIONS: తిరుపతి తుమ్మలగుంట రహదారిలో మురుగు కాలువలు శుభ్రం చేస్తూ మ్యాన్‌హోల్‌లోకి దిగి ముగ్గురు చనిపోయిన ఘటనకు..అధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుభవం, అవగాహన ఉన్న పారిశుద్ధ్య సిబ్బందిని పంపాల్సిన నగరపాలక అధికారులు… ఆరోగ్య విభాగంలో పని చేసిన వారిని మ్యాన్‌హోల్లోకి దింపి ప్రాణాలు తీశారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒప్పంద కార్మికులుగా విధుల్లోకి వచ్చిన ఆర్ముగం, మహేశ్.. కమిషనర్ కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో చిన్నచిన్న ట్యాంకులను శుభ్రం చేసే వారు. ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా మ్యాన్ హోల్లోకి వారిని దింపడం వల్లే విషవాయువులు పీల్చి చనిపోయారని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
నగరపాలక సంస్థ అధికారులు కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే కార్మికులు బలయ్యారని.. కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మురుగు కాలువలు శుభ్రం చేయాల్సి ఉన్నా..మధ్యాహ్నం వేళల్లో ఎందుకు పంపారని ప్రశ్నిస్తున్నారు. నిపుణులైన అధికారులు పర్యవేక్షణ లేకుండా..మ్యాన్‌హోల్లో దింపి ప్రాణాలు బలిగొన్నారని మండిపడ్డారు.
భూగర్భ మురుగు కాలువలు శుభ్రం చేసేందుకు అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నా.. వాటిని ఎందుకు కొనుగోలు చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్ కింద 2 కోట్ల రూపాయలు నిధులు విడుదలైనా.. వాటిని ఏం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: