శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మహిళా ఎస్‌ఐ శిరీష మానవత్వం చాటుకున్నారు. అనాథ వృద్ధుడి మృతదేహం తరలించేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో...స్వయంగా ఆమె ఆ మృతదేహాన్ని మోశారు. అడవికొత్తూరు శివారులో గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందినట్లు పోలీసులకు సమాచారం రావడంతో ...సిబ్బందితో సహా ఎస్‌ఐ శిరీష అక్కడికి చేరుకున్నారు.
ఆ వృద్ధుడి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రాకపోవడంతో...ఆమె రంగంలోకి దిగి మృతదేహాన్ని పొలాల్లో మోసుకుంటూ రహదారిపైకి చేర్చారు. అనంతరం ఆ వృద్ధుడి మృతదేహాన్ని లలితా ఛారిటబుల్ ట్రస్టుకు అప్పగించారు. ఎస్‌ఐ శిరీష ఔదార్యాన్ని డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు.
ఇదీ చదవండి: సింహద్వారం ఒక జిల్లాలో... ఇల్లు మరో జిల్లాలో!