ఆ రోజు అర్ధరాత్రి ఇసుక తరలింపులో తమ ప్రమేయం ఏమీ లేకపోయినా, తమ లారీలను సీజ్ చేసి, అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని విశాఖ లారీల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం వారు మీడియా ముందు తమ ఆవేదన వెళ్లగక్కారు. విశాఖపట్నం క్వారీ లారీల యూనియన్ అధ్యక్షుడు నమ్మి మాధవరావు మాట్లాడుతూ... కొందరు రాజకీయ నాయకులు బల్క్‌గా అనుమతులు తీసుకుంటున్నారు. 300-400 టన్నులు ఏపీఎండీసీ కార్యాలయం నుంచి విడుదల చేయించుకుంటున్నారు. దూసి రేవులో తమ్మినేని సంతోష్‌కుమార్ అనే వ్యక్తి కూడా బల్క్ ఆర్డర్ తీసుకున్నారు. అలా తీసుకున్న ఇసుకను మాలాంటి వారికి విక్రయిస్తుంటారు. టన్నుకు రూ.500- రూ.550 చొప్పున పాతిక టన్నుల లారీకి కనిష్ఠంగా రూ.12,500 వసూలు చేస్తారు. వాళ్లు ప్రభుత్వానికి చెల్లించేది టన్నుకు రూ.375 మాత్రమే. ఆరోజు జరిగింది కూడా అదే. వారిందరినీ వదిలేసి లారీల ఓనర్లను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు’’ అని పేర్కొన్నారు.
'‘రేవులో డిపార్ట్‌మెంటు మొత్తం ఉండి లోడింగు చేయిస్తోంది. మూడుమాసాలుగా దూసి రేవు నుంచి ఇసుకను తీసుకెళ్తుంటే కళ్లు మూసుకున్నారు. అక్కడ లోడింగ్ చేసే నాలుగు మిషన్లున్నాయి. వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడితే లారీలతో రోడ్డెక్కి ఆందోళన చేపడతాం' అని విశాఖ క్వారీ లారీల అసోసియేషన్ కార్యదర్శి రమణ హెచ్చరించారు. అక్రమాలకు ఎవరో పాల్పడితే లారీ డ్రైవర్ని, యజమానిని అరెస్టు చేస్తామనడం ఎంతవరకు న్యాయం అని లారీ యూనియన్ మాజీ అధ్యక్షులు మద్దిల వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: శ్రీకాకుళంలో అర్ధరాత్రి ఇసుక దందా