స్వామి అగ్నివేశ్ అసలు పేరు వేపా శ్యామ్‌రావు. కొంతకాలం తర్వాత శ్రీకాకుళం జిల్లాను వీడి పక్క రాష్ట్రంలో ఉన్న తాతయ్య ఇంటికి వెళ్లిపోయారు. ఆయనకు జిల్లాతో విడదీయరాని అనుబంధముంది. ఈ ప్రాంతాన్ని వదిలివెళ్లినా పుట్టిన మమకారాన్ని మాత్రం మరచిపోలేదు. శ్రీకాకుళం జిల్లా సోంపేట, కాకరాపల్లి థర్మల్ ఉద్యమాల్లో భాగస్వామ్యం పంచుకొని సమస్య తీవ్రతను జాతీయస్థాయిలో వినిపించేందుకు సహకరించారు. 2010 ఫిబ్రవరి, 2011లో ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న రోజుల్లో రెండుసార్లు సోంపేట వచ్చి బీల ప్రాంతాన్ని పరిశీలించారు. ఉద్యమకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. జన్మస్థానంపై అభిమానంతోనే ఇక్కడికి వచ్చానని ఉద్యమ సభల్లోనూ పేర్కొన్నారు. విశిష్ట చిత్తడి నేలల ప్రాంతమైన బీలలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తే శతాబ్దాల పాటు శ్రమించినా తయారు చేయలేని విలువైన జీవవైవిధ్య ప్రాంతాన్ని ధ్వంసం చేయడం అవుతుందని ఆయన ప్రభుత్వాలకు నివేదికలు పంపించారు.
చిత్తడి నేలల ప్రాధాన్యం, పర్యావరణం, జీవావరణం, జీవించే హక్కుల విషయమై ప్రజల్లో అవగాహన కలిగించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోనే అతి విశిష్టత కలిగిన బీల ప్రాంతం ప్రత్యేకమైన జీవవైవిధ్యం కలిగి ఉందని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడంలో సహకరించారు. థర్మల్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా సోంపేటలో సాగిన నిరాహార దీక్షల్లో కూడా పాలుపంచుకున్నారు. థర్మల్ ఉద్యమకారులను దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాల్లో భాగస్వాములను చేయడంలో అగ్నివేశ్ ప్రధానపాత్ర పోషించారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో పర్యావరణ పరిరక్షణ సంఘ ప్రధాన కార్యదర్శి బీన డిల్లీరావు తెలుగు ప్రసంగాన్ని హిందీలో అనువదించి మాతృభాషపై మమకారాన్ని చాటుకున్నారు.
ఇవీ చదవండి: ఆంగ్ల మాధ్యమంపై ప్రతిపక్షనేతవి అనవసర విమర్శలు: ధర్మాన