ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ‘అమ్మఒడి’ ఒకటి. ఇప్పటి వరకు పిల్లల తల్లుల ఖాతాలకు నగదు జమ చేస్తూ వస్తుండగా, ఈసారి శ్రీకాకుళం జిల్లాలో 9-12 తరగతుల విద్యార్థుల పిల్లలకు ల్యాప్‌టాప్‌కూ అవకాశం కల్పించింది. ఈరెండింట్లో ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులకే ప్రభుత్వం వదిలేసింది. పాఠశాలలు, కళాశాలల వారీగా ఈమేరకు వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. పాఠశాలల నుంచి అందిన సమాచారం క్రోడీకరిస్తే 28.70 శాతం మంది ల్యాప్‌టాప్‌ల వైపు మొగ్గు చూపగా, మిగిలిన వారు సొమ్ములనే ఎంచుకున్నట్లు స్పష్టమైంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రం యథాతథంగా తల్లుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం డబ్బులు బదలాయిస్తుంది.
ఆసక్తి ఎందుకు తగ్గింది?
పేరున్న కంపెనీలకు చెందిన ల్యాప్‌టాప్‌లు విద్యార్థులకు అందజేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. అయినా ఆ స్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి స్పందన కరవైంది. దీనికి కారణం వారిలో నెలకొన్న కొన్ని భయాలే కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. ల్యాప్‌టాప్ చెడితే దాన్ని బాగుచేయటం, గ్యారంటీ పీరియడ్, పనిచేసే సామర్థ్యం, ఇతరత్రా అపోహలే ఇందుకు కారణమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పూచీ మాదని ప్రకటించింది. మరమ్మతులకు గురైన ల్యాప్‌టాప్ సచివాలయాలకు అందజేస్తే నిర్ణీత గడువులోగా బాగు చేసి ఇస్తామని చెప్పింది. మరమ్మతులు (సర్వీసింగ్ సెంటర్లు) చేసే కేంద్రాలను విరివిగా తెరిచేలా చూస్తోంది. ఆన్‌లైన్ బోధనకు ల్యాప్‌టాప్‌లు దోహదం చేస్తాయని భావిస్తోంది. గత 15 నెలలుగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మధ్యలో కొన్ని నెలలు విద్యాలయాలకు వెళ్లినా కరోనా రెండో వ్యాప్తితో మళ్లీ ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. చాలా మంది పిల్లల తల్లిదండ్రులకు ఇప్పటికీ చరవాణిలు లేవు. ఇలాంటి వారంతా ఇబ్బంది పడుతున్నారు.
విద్యార్థుల ఇష్ట ప్రకారమే
అమ్మఒడి పథకంలో ల్యాప్‌టాప్ లేదా నగదా అన్నది విద్యార్థుల అభిష్టానికే ప్రభుత్వం వదిలేసింది. వారు తెలిపిన సమ్మతి మేరకు వాటిని అందిస్తుంది. ల్యాప్‌టాప్ కన్నా నగదు కోరుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. పాఠశాలల్లో 9-10 తరగతుల విద్యార్థులకే కోరుకొనే సౌలభ్యం ఉంది. దిగువ తరగతి విద్యార్థులకు నగదు బదిలీ చేస్తుంది. - పగడాలమ్మ, ఉప విద్యాశాఖాధికారిణి, శ్రీకాకుళం
శ్రీకాకుళం నుంచే గరిష్ఠం..
ల్యాప్‌టాప్ కావాలని శ్రీకాకుళం మండలం నుంచే ఎక్కువ మంది తమ సమ్మతి తెలిపారు. ఇక్కడ 2,742 మంది ల్యాప్‌టాప్‌కు, 7,225 మంది నగదుకు మొగ్గు చూపారు. 1,740 మంది అనర్హులుగా తేలారు. రాజాంలో 1,123, రణస్థలంలో 1,494, ఎచ్చెర్లలో 1,181, సీతంపేట 1,184, పాతపట్టణం 1,192, పలాస 1,183, కవిటి 1,304, ఇచ్ఛాపురం మండలంలో 1,063 మంది విద్యార్థులు ల్యాప్‌టాప్ కావాలని కోరుకున్నారు.
ఇంత వరకు ఇలా..
రూ.15 వేలను అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం సమకూర్చుతోంది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చింది. తొలి ఏడాది జమ చేసిన నగదులో రూ.వెయ్యి మరుగుదొడ్ల నిర్వహణకు విరాళంగా తీసుకుంది. గతేడాది రూ.14 వేలు తల్లుల ఖాతాల్లో జమచేసి రూ.వెయ్యిని మరుగుదొడ్ల నిర్వహణకు బదలాయించింది.
● పేర్లు నమోదు చేసుకున్న పాఠశాలల విద్యార్థులు: 1,10,772
● ఇందులో ల్యాప్‌టాప్ కోరుకున్నవారు: 31,794
● నగదు కావాలన్న వారు: 73,114
● పథకానికి అనర్హులుగా తేలినవారు: 5,864
ఇదీ చదవండి:
మమ్మల్ని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించండి: డీలర్ల సంఘం