శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో తుపాను ప్రభావం పై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఈదురుగాలుల జోరు పెరగడమే కాక.. భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంత ప్రజలు, గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మేఘవరం పంచాయతీ డెప్పూరు, వంగర గ్రామాల్లో అధికారులు ఎటువంటి పునరావాస చర్యలు చేపట్ట లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలుల తీవ్రతకు మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోయారు.
ఇచ్ఛాపురం సాగర తీర ప్రాంతమైన డొంకూరులో తుపాను అలజడి పెరుగుతోంది. సముద్రతీర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతుండటంతో...ప్రజలు భయపడుతూ బిక్కు మంటున్నారు. నాలుగు రోజులుగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా దూరంగా ఉంటున్నారు. ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు ఇటుక పరిశ్రమల్లో పనిచేస్తున్న కూలీలకు మధ్యాహ్నమే తరలించారు. తాగునీరు, భోజనం సాయంత్రం 4 గంటల వరకూ కూడా అధికారులు అందించలేదు.
సముద్ర తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత పెరిగింది. వజ్రపుకొత్తూరు మండలం భావనపాడు వద్ద సముద్రం పది మీటర్లు ముందుకు వచ్చింది. గార మండలం బందరవానిపేట వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతం తీర ప్రాంతాల్లో తెలికపాటి వర్షం పడుతోంది.