SRIKAKULAM SPECIAL STATUS MEETING UPDATES: కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. ఏపీకి కేటాయించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని.. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. రాష్ట్ర ఎంపీలు ప్రత్యేక హోదా విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయకుండా నిద్రపోతున్నారా..? అని ఆగ్రహించారు. శ్రీకాకుళంలో 'ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు' సమరయాత్ర సభను కోడి రామ్మూర్తి క్రీడా మైదానం సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సభను అడ్డుకుని.. క్రీడా మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన స్టేజ్‌తో పాటు కుర్చీలను తొలగించారు.
ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీకి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించటం లేదన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలపై రాష్ట్ర ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీయకుండా నిద్రపోతున్నారా అని ధ్వజమెత్తారు. అనంతరం ప్రస్తుతం పార్లమెంటు జరుగుతున్న సమావేశాల్లో రాష్ట్ర ఎంపీలు ప్రత్యేక హోదా విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా మీకోసం రావాలని.. ప్రాణం పోతున్నా ఆఖరి క్షణం వరకూ మీ కోసం, మీ బాగు కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఆంధ్ర వర్సిటీ, నన్నయ వర్సిటీలు వైస్ ఛాన్సలర్స్ ఉద్యమంలో పాల్గొన్నారు. మాకు పదవులు అవసరం లేదు. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తీరని అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించటం లేదు.-చలసాని శ్రీనివాస్, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు
శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు సమరయాత్ర సభను పోలీసులు అడ్డుకోవడంతో రెండవ పట్టణ సీఐ శ్రీనివాసరావుకు, సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎంతకీ పోలీసులు వినకపోవడంతో విద్యార్థులతో కలిసి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ సభా ప్రాంతానికి వచ్చి.. కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఇవీ చదవండి