Heavy rain in Srikakulam: కుండపోత వర్షాలతో శ్రీకాకుళం జిల్లా తడిసిముద్దయింది. మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వానలతో... సిక్కోలు వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం వల్ల... పరివాహక ప్రాంతాలు నీటమునిగి ప్రజలు అల్లాడుతున్నారు.
శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్‌ను వాననీరు ముంచేసింది. బస్టాండ్ ప్రాంగణమంతా జలదిగ్బంధమైంది. బయటికి పోయే మార్గం లేక ఎక్కడిక్కడే నీరు నిలిచిపోయింది. ఓ వైపు మోకాళ్ల లోతు నీరు, మరోవైపు లగేజీలతో... ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆపసోపాలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. చినుకు పడితే చాలు బస్టాండ్ చిత్తడి చిత్తడిగా మారిపోతోందని.. ఏళ్ల తరబడి ఇదే దుస్థితి ఉన్నా పట్టించుకునేవారు లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"ఆర్టీసీ బస్టాండ్‌ను వాననీరు ముంచేసింది. బస్టాండ్ ప్రాంగణమంతా మునిగిపోయింది. బయటికి పోయే మార్గం లేక ఎక్కడిక్కడే నీరు నిలిచిపోయింది. ఓ వైపు మోకాళ్ల లోతు నీరు, మరోవైపు లగేజీలతో... తిప్పలు పడుతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆపసోపాలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నాం. చినుకు పడితే చాలు బస్టాండ్ చిత్తడి చిత్తడిగా మారిపోతోంది. ఏళ్ల తరబడి ఇదే దుస్థితి ఉన్నా పట్టించుకునేవారు లేరు." -ప్రయాణికులు
ఆమదాలవలస, సరుబుజ్జిలి, పొందూరు, బూర్జ మండలాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. వాన జోరుతో జగనన్న కాలనీలోకి నీరు చేరింది. నివాసయోగ్యం కాని ప్రాంతంలో స్థలాలు ఇస్తే ఎలా ఉండాలంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమదాలవలస రైల్వే అంతర్గత మార్గం నీటిపాలై ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వరి పంట కీలక దశలో ఉన్నప్పుడు వానలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జోరు వానలతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.
ఇవీ చదవండి: