శ్రీకాకుళం జిల్లాలో 4 లక్షల 32 వేల 5 వందల 12 పైచిలుకు అన్ని రకాల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వీరిలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నవారు 20 నుంచి 30 శాతానికి మించడం లేదు. ఇప్పటికీ మెజారిటీ వాహన చోదకులకు డ్రైవింగ్ లైసెన్సులు లేవు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఆ ఘటనకు కారణమైన వారిలో ఎక్కువ మంది డ్రైవింగ్ లైసెన్సు లేకుండానే రోడ్లపైకి వచ్చినట్లు విచారణలో తేలుతున్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. బీమా కూడా వర్తించదని బీమా కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను మరింత కఠిన తరం చేశారు అధికారులు. వాటిని ఉల్లంఘించిన వారికి చలానాలు విధించేందుకు ట్రాఫిక్, పోలీసు సిబ్బంది సమాయత్తమయ్యారు.
సీసీ కెమెరాల ద్వారానే చలానా..
రోడ్డుపై ఎవరూ ఆపలేదనుకుంటే పొరపడినట్లేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారానే అత్యధిక చలానాలు విధిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. క్షణాల్లోనే సంబంధిత వాహన యజమానికి సంక్షిప్త సమాచారం రూపంలో వెళ్లిపోతోంది. ఈ చలానాల వసూళ్లకూ ప్రత్యేక డ్రైవ్లు చేపట్టే దిశగా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రమాదాలు జరిగినప్పుడు శిరస్త్రాణం, సీటు బెల్టు ప్రాణాలను కాపాడతాయి. ప్రమాదం కారణంగా కుటుంబ యజమాని మరణిస్తే ఆ వ్యక్తిపై ఆధార పడిన కుటుంబానికి బీమా దక్కాలంటే తప్పనిసరిగా వాహనానికి బీమా చేయించుకోవాలి. పోలీసుల కోసం కాక స్వీయ రక్షణకు, ప్రమాద రహిత ప్రయాణానికి రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరూ సహకరించాలి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారంతా ఇక నుంచి భారీ చలానాలు చెల్లించాల్సి ఉంటుంది. నేటి నుంచే ఈ నిబంధనలు అమలు చేస్తామని ఉప రవాణా కమిషనర్ చెబుతున్నారు. ఈ నిబంధలపై ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నామని పోలీసు, రవాణాశాఖ అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: